రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నా తక్కువ జీతాలే

రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నా తక్కువ జీతాలే
  • గురుకులాల పీఆర్సీ ఇంకెప్పుడు?
  • సర్కారు జీవో రిలీజ్‌‌ చేసి నెల దాటినా సప్పుడు లేదు
  • 20 వేల మంది స్టాఫ్‌‌ ఎదురుచూపు
  • రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నా తక్కువ జీతాలే
  • ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ హెల్త్ కార్డులే లేవు
  • సర్కారు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని వివిధ గురుకులాలకు కొత్త పీఆర్సీ అమలు పత్తా లేకుండా పోయింది. మూడేండ్లు ఆలస్యంగా పీఆర్సీ ప్రకటించిన సర్కారు.. నెల రోజుల కింద జీవో రిలీజ్‌‌ చేసింది. దాని అమలుపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. దీంతో గురుకుల ఎంప్లాయీస్‌‌కు ఎదురుచూపులు తప్పడంలేదు. రోజూ18 గంటలకు పైగా కష్ట పడుతున్నా.. జనరల్ స్కూళ్లు, కాలేజీల ఫ్యాకల్టీ కంటే తక్కువగా జీతాలు చెల్లిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ హెల్త్ కార్డులు లేవని, ఈసారైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో 1,000 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్‌‌ గురుకులాలు ఉన్నాయి. వీరిలో 20 వేల మంది వరకు స్టాఫ్‌‌ పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు 30 శాతం ఫిట్‌‌మెంట్‌‌ ప్రకటించారు. అయితే గురుకులాల్లో ఇది నేరుగా వర్తించదు. జీతాలపై గురుకుల సొసైటీల్లో బోర్డ్‌‌ ఆఫ్‌‌ గవర్నెర్స్‌‌ ఆమోదించి ప్రతిపాదలను సర్కారుకు పంపించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌‌ అంతా జరగడానికి సమయం పడుతుంది. దీంతో వీలైనంత త్వరగా ప్రక్రియ స్టార్ట్ చేసి, ఉత్తర్వులు ఇవ్వాలని ఫ్యాకల్టీ కోరుతున్నారు. 

పనికితగ్గ జీతాలేవి?
గురుకులాల్లో స్టాఫ్‌‌ దాదాపు 18 గంటలు డ్యూటీలు చేస్తారు. అయితే గతంలో ప్రభుత్వ ఫ్యాకల్టీ కంటే గురుకుల స్టాఫ్‌‌కు బేసిక్‌‌ పే ఎక్కువగా ఉండేది. ఇది రానురాను తగ్గుతూ వస్తోంది. సర్కారు లెక్చరర్ల బేసిక్‌‌ పే రూ.37,100 ఉండగా, గురుకుల స్టాఫ్ బేసిక్‌‌ పే మాత్రం రూ.35,180గా ఉంది. ఇంత పని చేసినా తక్కువ జీతాలు రావడంపై గురుకుల ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో ఇటు పాఠాలు చెప్తూనే అటు హౌస్ మాస్టర్‌‌గా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఫ్యాకల్టీ తీవ్ర ఒత్తిడికి గురై రోగాల బారిన పడుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వీరికి హెల్త్‌‌ కార్డులు ఇవ్వకపోవడంతో ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఇబ్బందులు పడుతున్నారు. 

వేతనాలు పెంచాలె
గతంలో ప్రభుత్వ టీచర్లు, లెకర్చర్లతో పోలిస్తే గురుకుల ఫ్యాకల్టీకి జీతాలు ఎక్కువగా ఉండేవి. కొన్నేండ్లుగా ప్రభుత్వ ఫ్యాకల్టీతో పోలిస్తే గురుకులాల స్టాఫ్‌‌కు బేసిక్‌‌ పే తగ్గిస్తూ వస్తున్నారు. ఎక్కువ సమయం పనిచేసినా వారికి తక్కువ వేతనాలు వస్తున్నయి. వెంటనే గురుకుల స్టాఫ్‌‌కు జీతాలు పెంచాలి. 
- కొంతం నరేందర్ రెడ్డి, టీఎస్‌‌డబ్ల్యూఆర్‌‌టీఈఏ, ఫౌండర్‌‌ ప్రెసిడెంట్‌‌

రెండు స్టేజీలు పెంచాలి
గురుకులాల్లో టీచర్ల జాబ్ చార్ట్ సాధారణ టీచర్లకు భిన్నంగా ఉంటుంది. 24 గంటలూ స్టూడెంట్లకు అందుబాటులో ఉండాలి. గురుకులాల ప్రారంభంలో సాధారణ టీచర్ల కంటే 3, 4 ఇంక్రిమెంట్లు అదనంగా ఇచ్చేవారు. ప్రభుత్వ టీచర్లకు నిర్ణయించిన వేతన స్కేళ్లను గురుకులాల స్టాఫ్‌‌కు ఒకటి లేదా రెండు స్టేజీలు పెంచి (పారిటీ) వేతన స్కేళ్లను పునరుద్ధరించాలి. 
- చావ రవి, జనరల్‌‌ సెక్రటరీ, టీఎస్ యూటీఎఫ్