హైదరాబాద్, వెలుగు: వివిధ శాఖలలోకి సర్దుబాటు చేసిన 5138 మంది వీఆర్వోల సమస్యల విషయంలో పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రెవెన్యూ సేవల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టం–2020 తర్వాత జరిగిన రీ డిప్లాయిమెంట్ వల్ల వారి సర్వీసు మ్యాటర్ల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరిస్తానన్నారు.
మంగళవారం సిటీలోని ట్రెసా ఆఫీసులో 33 జిల్లాల నుంచి వీఆర్వో సంఘం నేతలు వచ్చి ఆయనకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థ రద్దు టైమ్లో అందరికి ఆప్షన్లు, కౌన్సిలింగ్ ద్వారా కోరుకున్న శాఖల్లోకి బదలాయించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ సీఎం హామీకి భిన్నంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గత నెలలో జీవో జారీ చేసిందన్నారు. సర్వీసు మ్యాటర్లపై స్పష్టత లేకుండానే వీఆర్వోలను “రీడిప్లాయిమెంట్” పేరుతో ఏకపక్షంగా లాటరీ ద్వారా కొత్త శాఖలలో చేరాల్సిందిగా బలవంతంగా ఆర్డర్లు జారీ చేసిందన్నారు.

