మూడురోజుల సీఎంగా ముగ్గురు

మూడురోజుల సీఎంగా ముగ్గురు

ఫడ్నవీస్.. 80 గంటలు
అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో దేవేం ద్ర ఫడ్నవీస్ పేరు కూడా చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పటి వరకు ఉన్న రాష్ట్రపతి పాలనను గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఎత్తివేయించారు. శనివారం ఉదయాన్నేబీజేపీ నాయకుడు ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన తరువాత ఈ నెల 27 సాయంత్రంలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ 26న రాజీనామా చేశారు. అజిత్ రాజీనామా చేసిన కాసేపటికే ఫడ్నవీస్ కూడా పదవికి రాజీనామా చేశారు.

జగదాంబికా పాల్
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్ కు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1988 ఫిబ్రవరి 21న ప్రమాణస్వీకారం చేసిన పాల్, ఫిబ్రవరి 23న సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రమేష్ భండారీ బర్తరఫ్ చేసి, జగదాంబికా పాల్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో అలహాబాద్ హైకోర్టును కల్యాణ్ సింగ్ ఆశ్రయించారు. ఆయన సర్కారుని బర్తరఫ్ చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో జగదాంబికా పాల్ రాజీనామా చేయడంతో, కల్యాణ్ సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

యడ్యూరప్ప.. 72 గంటలు
బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప 2018లో మూడు రోజుల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మే 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మే 19న పదవి నుంచి దిగిపోయారు. అసెంబ్లీ ఎన్ని కల్లో 104 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో బీజేపీ నాయకుడైన యడ్యూరప్పతో అప్పటి గవర్నర్ వజూభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించి, బల నిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. అయితే ఇతర పార్టీలు కోర్టుకెళ్లడంతో డెడ్ లైన్ ని కోర్టు రెండు రోజులకు కుదించింది. ఈ లోపు మేజిక్ ఫిగర్ కు బీజేపీ చేరుకోలేకపోయింది. దీంతో మెజారిటీ నిరూపించుకోవడానికి ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు. అంతకుముందు 2007 సెప్టెంబర్ 12 నుంచి 19వరకు ఎనిమిది రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.