గ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లయినా.. ఎక్కడి పనులు అక్కడ్నే..

గ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లయినా.. ఎక్కడి పనులు అక్కడ్నే..

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్ల ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచిపోయాయి. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. మేనిఫెస్టోతో పాటు మరెన్నో హామీలు అమలుకు నోచుకోవడం లేదు. 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ స్కీమ్ నుంచి మొదలు ఈ-– లైబ్రరీల వరకు చాలా హామీలు పెండింగ్​లోనే ఉన్నాయి. రెండేళ్లుగా భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లోనైతే నెలల తరబడి ఇబ్బందులు తప్పలేదు. వరదలు వచ్చిన టైమ్​లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తొందరలోనే ఈ సమస్యకు చెక్ పెడతామని బాధితులకు హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ చాలా ప్రాంతాల్లో నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్​ఎన్​డీపీ ద్వారా నాలాల పనుల చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ఫస్ట్ ఫేజ్ పనులే పూర్తి కాలేదు. కేవలం ఒక్క నాలా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 

ఏ హామీని పట్టించుకోలే..

మూసీ నది  బ్యూటిఫికేషన్ తో పాటు బాపుఘాట్​నుంచి నాగోల్ వరకు బోటింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని, ఇందుకోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని టీఆర్ఎస్​ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ ఈ అంశం ఊసేలేదు. ఎంఎంటీఎస్ రైళ్లను మరో 90 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పటికీ గత నాలుగైదేళ్లుగా ఈ ప్రాసెస్​నత్తనడకన సాగుతోంది. హెచ్ఎండీఏ పరిధిలోని 2,700 చెరువులను దశల వారీగా బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి.. పదుల సంఖ్యలో కూడా బాగుచేయలేదు. ఆర్టీసీ బస్సుల రూపు రేఖలు మారుస్తామని, ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని పెంచుతామని చెప్పి ఉన్న వాటిలోనే 800 బస్సులను తగ్గించారు. హైటెన్షన్ కరెంట్​కేబుళ్లతో సిటిజన్లకు ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేస్తామని పూర్తి స్థాయిలో చేపట్టలేదు. సిటీలో ఇప్పటికే 5 లక్షల సీసీ కెమెరాలు ఉండగా, మరో 5 లక్షలు ఏర్పాటు చేస్తామని.. వాటి గురించే మాట్లాడటం లేదు. సిటీకి వచ్చేవారి కోసం షెల్టర్ హోమ్స్ విస్తరిస్తామని ఉన్నవాటిని కూడా పట్టించుకోవడంలేదు.

కరోనా వచ్చినా దవాఖానాలు లేవు..

పల్లెల నుంచి వచ్చే వారికి శివారు ప్రాంతాల్లోనే ట్రీట్​మెంట్​అందేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం సిటీ నలువైపులా నాలుగు టిమ్స్​ఆస్పత్రులను నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ గచ్చిబౌలి టిమ్స్​మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అందులో కూడా రెనోవేషన్ పేరుతో ఇన్ పేషెంట్ సేవలు నిలిపివేశారు.  గ్రేటర్​లో 350 బస్తీ దవాఖానాలను అందుబాటులో తీసుకొస్తామని 250తోనే సరిపెట్టారు. సిటీలో నేటికీ ప్రభుత్వ హాస్పిటల్స్​ లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కరోనా లాంటి విపత్తు వచ్చినా వీటి నిర్మాణాల్లో వేగం పెంచలేదు.  

సీనియర్ సిటిజన్లదీ అదే పరిస్థితి..

బస్తీల్లో ఇంగ్లీష్​ మీడియంతో మోడల్ స్కూల్స్​ఏర్పాటు చేస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదు. స్టూడెంట్లు, నిరుద్యోగుల కోసం కాలనీల్లో ఈ– లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించినా ఎలాంటి పురోగతి లేదు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్​లో ఓ క్లబ్, లైబ్రరీ, యోగా సెంటర్, జిమ్స్ ఏర్పాటు, ఫ్రీ బస్ పాస్ ​ఫెసిలిటీ కల్పిస్తామని గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. కానీ అమలు చేయడంలేదు.

పూర్తి స్థాయిలో అందని ఉచిత నీరు

ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో రెండో అంశంగా ఇదే చూపారు. కానీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. కొంతమందికి మాత్రమే ఫ్రీ వాటర్ సరఫరా అవుతోంది. మరికొంతమందికి కొన్ని నెలలు ఫ్రీగా అందించి ఆపై బిల్లులు అందజేశారు. ఇక మురికి వాడల్లో ఉన్న వారికి ఉచితంగా వాటర్ సప్లయ్ చేస్తామనప్పటికీ చాలా ప్రాంతాల్లో అమలు చేయలేదు. బిల్లులు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత నీరు అందుతున్న వారికి ఏదో ఒక కారణం చూపుతూ స్కీమ్ వర్తించదని నీటి సరఫరా కట్ చేస్తున్నారు.

డబుల్ ఇండ్లు,  పెన్షన్లు..

గ్రేటర్​లో లక్ష డబుల్​బెడ్రూం ఇండ్లు అందిస్తామని ప్రతి సమావేశంలో మంత్రులు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 6 వేల ఇండ్లను మాత్రమే అందించారు. నిర్మాణాలు పూర్తయిన వాటి కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరగలేదు. దరఖాస్తులు చేసుకున్నవారు ఆఫీసు​ల చుట్టూ తిరుగుతున్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామన్నారు. హుజూరాబాద్​ఎన్నికల టైమ్​లో కొంతమందికి మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేశారు. ప్రస్తుతం వేలాదిమంది వీటి కోసం వెయిట్​చేస్తున్నారు.