కల్వకుర్తి రిజర్వాయర్ల పనులు ఎక్కడి వక్కడే

కల్వకుర్తి రిజర్వాయర్ల పనులు ఎక్కడి వక్కడే
  • తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్
  •  యాక్షన్ ప్లాన్, అంచనాలు సిద్ధమైనా పెండింగ్ లోనే..
  • మూడేండ్లుగా సీఎం క్లియరెన్స్ కోసమే వెయిటింగ్
  •  భారీ వరద వచ్చినా నీళ్లు వాడుకునే చాన్స్ లేని పరిస్థితి

కృష్ణా నీళ్లను మరింతగా వాడుకునేందుకు కల్వకుర్తి లిఫ్టు కింద ప్లాన్​ చేసిన రిజర్వాయర్ల పరిస్థితి ఎక్కడికక్కడే ఉండిపోయింది. యాక్షన్​ప్లాన్, అంచనాలు సిద్ధమైనా పనులు మొదలుకాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు.. ‘‘కృష్ణాలో వరదలు ఉప్పొంగినపుడు కల్వకుర్తి నుంచి ఎత్తిపోసే నీళ్లను నిల్వ చేసేందుకు సరైన రిజర్వాయర్లు లేవు. సమైక్య పాలకులు పట్టించుకోలేదు. నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రాజెక్టుకు కనీసం 40 టీఎంసీల రిజర్వాయర్లు ఉండవా? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు అవసరమో సర్వే చేయిస్త. రెండు పంటలకు నీళ్లు అందేలా చూస్త’’ అని రాష్ట్ర ఏర్పాటుకు ముందు, సీఎం అయిన తర్వాత పలుమార్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇన్నేండ్లుగా అది అమల్లోకి రాలేదు. రిజర్వాయర్లకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ అయి మూడేండ్లైనా సీఎం కేసీఆర్​ ఆమోదం దగ్గరే ఆగిపోయాయి.

ఇప్పుడున్న కెపాసిటీ 4 టీఎంసీలే..

శ్రీశైలం ఫోర్‌‌  షోర్‌‌ లోని ఎల్లూర్‌‌ నుంచి కృష్ణా నీటిని మూడు దశల్లో లిఫ్ట్​ చేసి వనపర్తి, నాగర్‌‌ కర్నూల్‌‌, మహబూబ్‌‌ నగర్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని 3.65 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌  స్కీమ్​ను చేపట్టారు. దీని కింద ఉన్న ఎల్లూర్‌‌, సింగోటం, జొన్నల బొగుడ, గుడిపల్లిగట్టు బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లలో కేవలం నాలుగు టీఎంసీల నీళ్లను నిల్వ చేసే అవకాశముంది. తర్వాత కల్వకుర్తి కెపాసిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌‌.. వరద టైంలో లిఫ్ట్​ చేసే నీళ్ల నిల్వ కోసం బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రకటించారు. దీనిపై ఇరిగేషన్‌‌ ఇంజనీర్లు సర్వే చేసి 53 చెరువులను రిజర్వాయర్లుగా అప్‌‌గ్రేడ్‌‌ చేయడానికి అవకాశం ఉందని నిర్ధారించారు. అందులో ఫస్ట్‌‌ ప్రయారిటీ కింద 38 చెరువులు, సెకండ్‌‌ ప్రయారిటీ కింద 9 చెరువులు, థర్డ్‌‌ ప్రయారిటీ కింద ఆరు చెరువులను బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లుగా అప్‌‌ గ్రేడ్‌‌ చేయవచ్చని.. మొత్తంగా 18.43 టీఎంసీలను స్టోర్​ చేసుకోవచ్చని గుర్తించారు. 25,283 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని లెక్కగట్టారు.

2017లోనే ప్లాన్​ రెడీ అయినా..

వనపర్తి, నాగర్‌‌  కర్నూల్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని 38 చెరువులను మొదటి దశలో బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లుగా మార్చాలని… రెండో దశలో మహబూబ్‌‌ నగర్‌‌, నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లాల్లోని మరో 9 చెరువులను టేకప్‌‌ చేయాలని ఇంజనీర్లు సర్కారుకు సూచించారు. ఈ 47 చెరువులకు సంబంధించి ప్రతిపాదనలను 2017 ఆగస్టులోనే సర్కారుకు పంపారు. వీటిల్లో 16.11 టీఎంసీల నీళ్లు నిల్వ చేయవచ్చని,  రూ.2,717.67 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. 23,200 ఎకరాల భూమి ముంపు ఉంటుందని, ఎకరానికి ఐదున్నర లక్షల చొప్పున పరిహారమిస్తే రూ.1,276 కోట్లు అవుతుందని.. మొత్తంగా రూ.4,177 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సర్కారు నుంచి క్లియరెన్స్​ వస్తే వెంటనే పనులు మొదలుపెట్టేలా యాక్షన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేసుకున్నారు. కానీ మూడేండ్లవుతున్నా సీఎం ఆ ఫైల్‌‌కు ఓకే చేయలేదు. కనీసం భూసేకరణ చేసి ఉన్నా బాగుండేదని, ఇప్పుడు ఎకరానికి రూ.10 లక్షలకుపైగా ఇస్తే తప్ప రైతులు భూములు ఇచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుందని చెప్తున్నారు.

నీళ్లన్నీ వృథాగా పోయినయి

శ్రీశైలం ప్రాజెక్టుకు గతేడాది 1,786 టీఎంసీల వరద వచ్చింది. కల్వకుర్తి స్కీం ద్వారా 49 టీఎంసీలు మాత్రమే రాష్ట్రం వాడుకోగలిగింది. వరద పోటెత్తిన రోజుల్లో కూడా మొత్తం పంపులను ఆపరేట్‌‌ చేయ లేదు. కాల్వలకు లైనింగ్‌‌ చేయకపోవడంతో అన్ని మోటార్లను నడిపే అవకాశం లేదని ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆ తర్వాతైనా కాల్వల లైనింగ్‌‌ పనులు చేపట్టలేదు. కాల్వలను ఫుల్​ కెపాసిటీకి బలోపేతం చేసి, బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లు నిర్మించి ఉంటే మరో 16 టీఎంసీల మేర అదనంగా తీసుకునే చాన్స్‌‌ ఉండేదని అంటున్నారు. సర్కారు పట్టించుకోకపోవడంతో నీళ్లన్నీ సముద్రం పాలయ్యాయని రైతులు మండిపడుతున్నారు. ఏపీ సంగమేశ్వరం లిఫ్ట్‌‌ను తలపెట్టిందని, ఈ  తరుణంలోనైనా కల్వకుర్తి రిజర్వాయర్లపై సర్కారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.