ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. అవగాహనే అసలైన నివారణ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. అవగాహనే అసలైన నివారణ

ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని  నిర్వహిస్తారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈ రోజును కేటాయించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988 లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. 

ఎయిడ్స్ అంటే..

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) ద్వారా ఎయిడ్స్ వస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. రోగ నిరోధక శక్తి క్షీణించడం అంటే.. మనకి అనారోగ్యాన్ని కలిగించే అంటు వ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ముఖ్యంగా సీడీ 4 అనే రోగనిరోధక కణాలను ఈ వైరస్ చంపేస్తుంది. దీనివలన వివిధ వ్యాధులు సోకి మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

లక్షణాలు...

ఈ వ్యాధి లక్షణాల్లో మొదటగా కనిపించేది గొంతు నొప్పి, అలసట, జ్వరం, ఫ్లూ.  ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా ఎయిడ్స్ ప్రమాదకరమైన సంకేతాల్లో ఒకటిగా చెబుతారు. వీటితో పాటు రాత్రిపూట చెమటలు బాగా పట్టడం కూడా వ్యాధి లక్షణాలలో ఒకటి. తరచూ రాత్రి వేళ చెమటలు అధికంగ పడితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారి కండరాల్లో నొప్పి అధికంగా ఉంటుంది. ఇక హెల్త్ లైన్ ప్రకారం జననేంద్రియ భాగాల్లో తరచూ పుండ్లు రావడం కూడా ఎయిడ్స్ లక్షణాల్లో ఒకటి. చర్మం మీద తరచుగా దద్దుర్లు వచ్చి, తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.

హెచ్ఐవి ఎయిడ్స్ గా ఎలా మారుతుందంటే..

 తల్లి పాలు, యోని, మల ద్రవాలు, రక్తం ద్వారా హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది. ఇది జీవితకాలం పాటు ఉండే ప్రక్రియ. దీనిని నయం చేయలేము. కానీ సరైన చికిత్స, నిర్వహణతో హెచ్ఐవీ సోకిన వ్యక్తి చాలా సంవత్సరాలు బతికే అవకాశం అయితే ఉంది.

15-48 వయస్సు వారే అధికం...

మన దేశంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 15 నుంచి 48 సంవత్సరాల లోపు వారే ఉండటం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా.. ప్రతి వంద మంది గర్భిణీల్లో ఒకరికి హెచ్‌ఐవీ లక్షణాలు ఉన్నట్టు వైద్య పరీక్షలు ధృవీకరిస్తున్నాయి. అలాగే.. ఇటీవలి కాలంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో 14-24 సంవత్సరాల యువతీ యువకులు ఉన్నారని వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం విచ్చలవిడి శృంగారమేనని తేలింది.

లెక్కల్లో హెచ్ఐవీ బాధితులు...

2021 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 38.4 మిలియన్ల మంది HIV- పాజిటివ్ వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. వారిలో 25.6 మిలియన్ల మంది ఆఫ్రికన్ రీజియన్‌లో నివసిస్తున్నారట. అయితే UKలో 4,139 మంది వ్యక్తులు ప్రతి సంవత్సరం HIV పాజిటివ్ గా నమోదవుతున్నారని ఓ సర్వే చెబుతోంది. వారిలో చాలా మందికి వ్యాధి లక్షణాలతో పాటు, పక్షపాతం ఉండడం సర్వసాధారణంగా మారిపోతున్నట్టు తెలిపింది.