ఆఫ్ఘాన్‌కు నిధులు నిలిపేసిన వరల్డ్ బ్యాంక్

ఆఫ్ఘాన్‌కు నిధులు నిలిపేసిన వరల్డ్ బ్యాంక్

తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘన్‌లో ఆర్థిక కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.  అయితే ఇప్పటికే  ఆ దేశానికి అమెరికా ఇచ్చే రిజర్వులను నిలిపేసింది. ప్రస్తుతం  వరల్డ్ బ్యాంక్ కూడా  నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌లో తాము చేపట్టిన ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశామని, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ప్రపంచ బ్యాక్‌ ప్రతినిధి తెలిపారు. ఇన్నేళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధిని కాపాడుకొనేందుకు అక్కడ కొనసాగే విషయంపై తమ భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని పరిశీలిస్తున్నామని .. ఆ దేశ ప్రజలకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘన్‌ భవిష్యత్తు, మహిళల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. 2002 నుండి ప్రపంచ బ్యాంకు ఇక్కడ 5.3 బిలియన్‌ డాలర్లతో ఆఫ్ఘన్‌ పునర్‌ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. అయితే.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పనులు నిలిచిపోయాయి. దీంతో తమ సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ప్రపంచబ్యాంకు పాకిస్తాన్‌కు తరలించింది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా అఫ్గాన్‌కు చెల్లింపులు నిలిపివేసింది.