భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం గ్రోత్ ఉండొచ్చు: ప్రపంచ బ్యాంకు

భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం గ్రోత్ ఉండొచ్చు: ప్రపంచ బ్యాంకు

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ బలమైన సేవల కార్యకలాపాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 6.3 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. గతంలో వేసిన అంచనానే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. గ్లోబల్​ మార్కెట్లలో సవాళ్లు ఉన్నప్పటికీ ఇండియా నిలదొక్కుకుంటున్నదని మెచ్చుకుంది.  ప్రపంచ బ్యాంకు తన ఏప్రిల్ రిపోర్టులో కూడా 6.3 శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. 

2022–-23లో మనదేశం 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో, ఆసియా డెవెలప్​మెంట్​ బ్యాంక్  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3 శాతానికి స్వల్పంగా తగ్గించింది. ఆర్‌‌బీఐ తాజా అంచనా ప్రకారం 2023-–24లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధి చెందుతుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌‌మెంట్ తన తాజా నివేదికలో భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి అంచనా 6 శాతం నుంచి 6.3 శాతానికి పెంచింది. 

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారతదేశ వృద్ధి అంచనాను 6.3 శాతం వద్ద ఉంచగా, ఎస్​అండ్​ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ మునుపటి అంచనా 5.9 శాతం నుంచి 6.6 శాతానికి పెంచింది.  2023–-24లో వ్యవసాయ రంగం 3.5 శాతం, పరిశ్రమ 5.7 శాతం,  సేవలు 7.4 శాతం వృద్ధి సాధించవచ్చని  ప్రపంచ బ్యాంకు   పేర్కొంది.  పెట్టుబడి వృద్ధి 8.9 శాతం వద్ద పటిష్టంగా ఉంటుందని అంచనా.