
నాగ్‌పూర్: ఫిడే వరల్డ్ కప్ ఫైనల్లో సహచర గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపితో ఆడుతున్నప్పుడు తనపై ఎలాంటి ఒత్తిడి లేదని గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ వెల్లడించింది. ఇతర అంశాలపై కాకుండా కేవలం తన ప్రదర్శనపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని చెప్పింది. ‘మ్యాచ్ సందర్భంగా నేను ఎలాంటి ప్రమాదంలో లేను. హంపి చేసిన చివరి తప్పు నాకు విజయాన్ని తెచ్చి పెట్టిందని అనుకుంటున్నా. ఫలితం నా చేతుల్లో లేదు. కేవలం పెర్ఫామెన్స్‌పైనే దృష్టి పెట్టేందుకు ప్రయత్నించా. వేరే అంశాల గురించి ఆలోచించలేదు’ అని బుటమి నుంచి స్వదేశానికి చేరుకున్న దివ్య పేర్కొంది.
విమానాశ్రయంలో ప్రజలు చూపెట్టిన అప్యాయతకు ఉప్పొంగిపోయానని తెలిపింది. అండర్ డాగ్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన దివ్య గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నేరవేర్చుకుంది. ఈ విజయం తర్వాత ఇండియాలో విమెన్స్ చెస్ పెద్ద ఎత్తున పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఈ విజయం తర్వాత విమెన్స్, యూత్ పెద్ద సంఖ్యలో చెస్‌ను ఎంచుకుంటారని ఆశిస్తున్నా. ఇవేవి అసాధ్యం కాని కలలు కాదని భావిస్తారు. నా దగ్గర యువతరానికి ఇచ్చే సందేశం లేదు. పిల్లలకు కావాల్సిన మద్దతును పేరెంట్స్ హృదయపూర్వకంగా ఇవ్వాలి. వైఫల్యాల సమయంలో ఇది చాలా అవసరం. విజయం సాధించడం అంత ఈజీ కాదు. నా తల్లిదండ్రుల వల్లే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది’ అని దివ్య వ్యాఖ్యానించింది.