వరల్డ్ కప్: 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

వరల్డ్ కప్: 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

విండీస్‌‌ లక్ష్యం 50 ఓవర్లలో 289 పరుగులు..  45 ఓవర్లలో 251/6… కరీబియన్లు గెలవాలంటే 30 బంతుల్లో 38 పరుగులు కావాలి…  క్రీజులో భారీ హిట్టర్లు హోల్డర్‌‌ (57 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 51),  బ్రాత్‌‌వైట్‌‌ (16). ఈ ఇద్దరి జోరు చూస్తే విండీస్‌‌ విజయం నల్లేరుమీద నడకే…!  కానీ,  స్లాగ్‌‌ ఓవర్స్‌‌ వేసేందుకు  వచ్చిన స్టార్క్‌‌ (5/46) ఆఖర్లో అద్భుతం చేశాడు. 46వ ఓవర్‌‌లో 4 బంతుల తేడాలో ఈ ఇద్దర్ని పెవిలియన్‌‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌‌లో  స్టోయినిస్‌‌ 3 రన్స్‌‌ ఇవ్వడంతో టార్గెట్‌‌ 18 బంతుల్లో 34గా మారింది. మళ్లీ స్టార్క్‌‌ (48వ ఓవర్‌‌) వచ్చాడు.. మూడో బంతికి కొట్రెల్‌‌ (1)ను ఔట్​ చేశాడు . అంతే.. 7 బంతుల తేడాలో 3 వికెట్లు తీసి అప్పటివరకు గెలుపు దిశగా సాగిపోతున్న విండీస్‌‌ను ఒక్కసారిగా ఓటమి అంచుల్లోకి నెట్టేశాడు. చివరి 12 బంతుల్లో 33 రన్స్‌‌ అవసరమైన దశలో నర్స్‌‌ (19  నాటౌట్‌‌) వరుసగా నాలుగు ఫోర్లు బాదినా.. ప్రయోజనం లేకపోయింది.  మ్యాచ్‌‌ మొత్తంలో ఎక్కువగా విండీస్‌‌ ఆధిపత్యమే నడిచినా.. చివరి ఫలితం మాత్రం పోరాటస్ఫూర్తిని చూపెట్టిన కంగారూలకు దక్కింది.

నాటింగ్‌‌హామ్‌‌:

వరల్డ్‌‌కప్‌‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌‌లో కూల్టర్‌‌నైల్‌‌ (60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 92), బౌలింగ్‌‌లో స్టార్క్‌‌  దుమ్మురేపడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో కంగారూలు 15 పరుగుల తేడాతో వెస్టిండీస్‌‌పై గెలిచారు. ముందుగా ఆసీస్‌‌ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. మాజీ సారథి స్టీవ్‌‌ స్మిత్‌‌ (103 బంతుల్లో 7 ఫోర్లతో 73) యాంకర్‌‌ పాత్రతో ఆకట్టుకోగా, కారీ (55 బంతుల్లో 7 ఫోర్లతో 45) ఫర్వాలేదనిపించాడు. తర్వాత విండీస్‌‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులకే పరిమితమైంది. హోప్‌‌ (105 బంతుల్లో 7 ఫోర్లతో 68), పూరన్‌‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 40) చెలరేగి ఆడినా.. విజయాన్ని అందించలేకపోయారు. కూల్టర్‌‌నైల్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

  ఆఖర్లో తడబాటు..

మెరుపులు మెరిపిస్తాడనుకున్న గేల్‌‌ (21), లూయిస్‌‌ (1) విఫలంకావడంతో..  టార్గెట్‌‌ ఛేజ్‌‌లో విండీస్‌‌కు సరైన ఆరంభం దక్కలేదు. 31 పరుగులకే ఈ ఇద్దరు ఔట్‌‌కావడంతో హోప్‌‌, పూరన్‌‌పై ఒత్తిడి పెరిగింది.  స్టార్క్‌‌ , కమిన్స్‌‌ (2/41) స్వింగ్‌‌, పేస్‌‌తో విరుచుకుపడినా.. ఈ ఇద్దరు నిలకడగా ఆడారు. పవర్‌‌ప్లేలో 54 రన్స్‌‌ చేసి కుదురుకున్నారు. ఓసారి క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి బయటపడ్డ పూరన్‌‌. స్టోయినిస్‌‌ బంతిని స్టాండ్స్‌‌లోకి పంపి జోరు పెంచాడు. కానీ 20వ ఓవర్‌‌లో పూరన్‌‌ను ఔట్‌‌ చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను జంపా విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హోప్‌‌తో కలిసి హెట్‌‌మెయర్‌‌ (21) సమయోచితంగా ఆడాడు. నాలుగో వికెట్‌‌కు 50 పరుగులు జత చేసినా అనూహ్య రనౌట్‌‌తో వెనుదిరిగాడు. ఈ దశలో హోల్డర్‌‌ స్ట్రయిక్‌‌ రొటేషన్‌‌తో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. 76 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌‌ను చేరిన హోప్‌‌ను 37వ ఓవర్‌‌లో కమిన్స్‌‌ పెవిలియన్‌‌కు చేర్చడంతో కరీబియన్‌‌ స్కోరు 190/5గా మారింది. హోప్‌‌తో ఐదో వికెట్‌‌కు 41 పరుగులు జోడించిన హోల్డర్‌‌.. గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. రసెల్‌‌ (15) మూడు భారీ షాట్లతో విరుచుకుపడినా.. 39వ ఓవర్‌‌లో మ్యాక్స్‌‌వెల్‌‌ రన్నింగ్‌‌ క్యాచ్‌‌కు స్టన్‌‌ అయ్యాడు.  ఇక చివరి 10 ఓవర్లలో 68 పరుగులు కావాల్సిన దశలో హోల్డర్‌‌, బ్రాత్‌‌వైట్‌‌ వేగం పెంచారు. ఈ క్రమంలో హోల్డర్‌‌ వరుసగా బౌండరీలు కొట్టడంతో 50 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి అయ్యింది.  ఈ ఇద్దరు జోరు పెంచుతున్న క్రమంలో స్టార్క్‌‌ ఘోరమైన దెబ్బతీశాడు.

ఇద్దరే ఆడారు..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్‌‌ను… విండీస్‌‌ పేసర్లు షార్ట్‌‌ పిచ్‌‌ బాల్స్‌‌తో  బెంబేలెత్తించారు. పేస్‌‌ బౌలింగ్‌‌కు అనుకూలమైన ట్రెంట్‌‌బ్రిడ్జ్‌‌ వికెట్‌‌పై అద్భుతమైన బౌన్స్‌‌, సీమ్‌‌ మూవ్‌‌మెంట్‌‌ను రాబట్టారు.  ఓ దశలో 79/5 స్కోరుతో ఆసీస్‌‌ను కష్టాల్లోకి నెట్టినా.. మ్యాచ్‌‌ మధ్యలో పట్టు సడలించారు. దీంతో స్మిత్‌‌, కూల్టర్‌‌నైల్‌‌ కీలక భాగస్వామ్యంతో కంగారూలకు భారీ స్కోరును అందించారు. మ్యాచ్‌‌ ఆరంభంలో రెండువైపుల నుంచి కొట్రెల్‌‌ (2/56), రసెల్‌‌ (2/41), థామస్‌‌ (2/63) నిప్పులు చెరగడంతో.. 8 ఓవర్లు కూడా ముగియకముందే ఆసీస్‌‌ 38 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫించ్‌‌ (6), వార్నర్‌‌ (3)తో సహా ఖవాజ (13), మ్యాక్స్‌‌వెల్‌‌ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్‌‌కు చేరారు. ఫలితంగా  పవర్‌‌ప్లేలో 48 పరుగులే వచ్చాయి. అయితే 4వ ఓవర్‌‌లో 26/2 స్కోరు వ్దద క్రీజులోకి వచ్చిన స్మిత్‌‌ అత్యుత్తమ ఆటతీరును చూపెట్టాడు. ఎక్కడా తడబడకుండా విలువైన భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించాడు. రెండోఎండ్‌‌లో స్టోయినిస్‌‌ (19) నిరాశపర్చినా.. కారీతో కలిసి ఆరో వికెట్‌‌కు 68 పరుగులు జత చేశాడు.  31వ ఓవర్‌‌ (147/6)లో కారీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌‌కు వచ్చిన కూల్టర్‌‌నైల్‌‌.. కరీబియన్‌‌ బౌలర్లను దంచికొట్టాడు. స్మిత్‌‌ను పక్కనబెట్టి గ్రౌండ్‌‌ నలువైపులా బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అవతలి వైపు స్మిత్‌‌ కూడా అవసరమైనప్పుడు బ్యాట్‌‌ ఝుళిపించడంతో రన్‌‌రేట్‌‌ పరుగెత్తింది.  ఈ ఇద్దరి దాటికి..17 ఓవర్లలో 79/5తో కష్టాల్లో పడ్డ ఆసీస్‌‌ స్కోరు బోర్డు 40 ఓవర్లు ముగిసేసరికి 206/6తో పటిష్ట స్థితికి చేరుకుంది.  ఈ క్రమంలో స్మిత్‌‌ (77 బాల్స్‌‌), కూల్టర్‌‌నైల్‌‌ (41 బాల్స్‌‌) హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. ఇదే జోరులో 45 ఓవర్‌‌లో థామస్‌‌ బంతిని భారీ షాట్‌‌గా మలిచిన స్మిత్‌‌.. కొట్రెల్‌‌ సూపర్‌‌ ఫీల్డింగ్‌‌కు పెవిలియన్‌‌కు చేరాడు. బౌండరీ లైన్‌‌ వద్ద కొట్రెల్‌‌ అందుకున్న క్యాచ్‌‌ మ్యాచ్‌‌కే హైలెట్‌‌గా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌‌కు 102 పరుగులు సమకూరాయి. చివర్లో విజృంభించిన బ్రాత్‌‌వైట్‌‌ (3/67) కూల్టర్‌‌నైల్‌‌ సెంచరీని మిస్‌‌ చేయగా, కమిన్స్‌‌ (2), స్టార్క్‌‌ (8) విఫలమయ్యారు. ఓవరాల్‌‌గా చివరి 9 ఓవర్లలో 81 పరుగులు రావడంతో ఆసీస్‌‌ భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది.