హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో 60వ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటరీ (ఐజీఎఫ్‌ఆర్) వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఆసియాలో తొలిసారి హైదరాబాద్‌లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్, వూటీ గోల్ఫ్ కౌంటీలో పోటీలు నిర్వహించనున్నారు.
23 దేశాల నుంచి 173 మంది గోల్ఫర్లు, వాళ్ల పార్టనర్‌లు 49 మందితో కలిపి మొత్తం 222 మంది ఇందులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి 69 మంది గోల్ఫర్లు వారి పార్టనర్‌లు 27 మందితో కలిపి 96 మంది హాజరవుతుండటం విశేషం. వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ పోటీలకు తెలంగాణ టూరిజం శాఖ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
వచ్చేనెల 2వ తేదీన తాజ్ కృష్ణలో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. 3 నుంచి 4 వరకు బాల్, బెస్ట్ బాల్ ఫ్రెండ్‌షిప్ టోర్నమెంట్, 4, 6, 7 తేదీల్లో రోటరీ వరల్డ్ చాంపియన్‌షిప్ రౌండ్‌లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి రోటరీ గోల్ఫర్లు, వారి పార్టనర్‌లు ఆయా దేశాల్లో ప్రముఖ కంపెనీలకు సీఈఓలు కావడంతో టూరిజాన్ని ప్రమోషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ చారిత్రక ప్రాంతాలు గోల్కొండ కోట, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియంతోపాటు రామోజీ ఫిలింసిటీ, వికారాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
