సూరత్​లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్

సూరత్​లో వరల్డ్  లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్

గుజరాత్​లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ‘సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్ డీబీ) ఇది. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 ఫ్లోర్ల చొప్పున ఉన్న 9 టవర్లతో నిర్మించారు. ఇందులో ఆఫీస్​లు 300 నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 4,500 వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఈ బిల్డింగ్​ను  ప్రధాని మోదీ ప్రారంభించారు.

సూరత్/వారణాసి: దేశంలోని 140 కోట్ల మంది ప్రజలం తలచుకుంటే భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కోసం దృఢ సంకల్పంతో పని చేస్తే తప్పకుండా ఇది సాధ్యం అవుతుందన్నారు. ఆదివారం యూపీలోని వారణాసిలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో ఈ యాత్ర అత్యంత కీలకమన్నారు. ‘‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నాకు ఎగ్జాంలాంటిది. నేను ఇచ్చిన హామీలను నెరవేర్చానా? లేదా? అన్నది దీని ద్వారా తెలుసుకుంటాను. పీఎం ఆవాస్ యోజన అమలైతే చాలు.. ప్రజలు ఇండ్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. 

ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 4 కోట్ల కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం జరిగింది” అని మోదీ తెలిపారు. గుజరాత్ టూర్ తర్వాత ప్రధాని ఆదివారం మధ్యాహ్నం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్ కమ్ చెప్పారు. అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తూ మోదీ కట్టింగ్ మెమోరియల్ ఇంటర్ కాలేజీకి చేరుకుని వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఎగ్జిబిషన్ ను సందర్శించారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల, ఇతర పథకాల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. సాయంత్రం 5 గంటలకు నమో ఘాట్ వద్ద కాశీ తమిళ్ సంగమం-2023 రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. కాశీ తమిళ్ సంగమంలో భాగంగా.. డిసెంబర్ 17 నుంచి 31 వరకూ తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1,400 మంది ప్రతినిధులు వేర్వేరు గ్రూపులుగా వారణాసి, ప్రయాగ్ రాజ్, అయోధ్య సిటీలను సందర్శించనున్నారు. మోదీ రెండు రోజుల వారణాసి టూర్ లో రూ. 19 వేల కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
 
వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్

గుజరాత్​లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ‘సూరత్ డైమండ్ బోర్స్(ఎస్​డీబీ)’ను ప్రధాని మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. అంతర్జాతీయ వజ్రా లు, ఆభరణాల వ్యాపారానికి ఈ బిల్డింగ్ ప్రధాన హబ్​గా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. సూరత్​లోని డైమండ్ ఇండస్ట్రీ ద్వారా ఇప్పుడు 8 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని, ఎస్​డీబీ ద్వారా మరో 1.5 లక్షల మందికి జాబ్​లు వస్తాయన్నారు. కాగా, సూరత్ శివార్లలోని డ్రీమ్ సిటీలో ఎస్​డీబీని నిర్మించారు. 35.54 ఎకరాల్లో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ ఉంది. ఇందులో దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. 15 ఫ్లోర్ల చొప్పున 9 టవర్లతో దీనిని నిర్మించారు. ఒక్కో ఆఫీస్ 300 నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అంతకుముందు సూరత్ ఎయిర్ పోర్టులో కొత్త టర్మినల్ బిల్డింగ్​ను కూడా ప్రధాని ప్రారంభించారు. సూరత్ ఎయిర్ పోర్టును కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మార్చామని ప్రధాని చెప్పారు. దీనితో గుజరాత్​లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల సంఖ్య మూడుకు పెరిగిందన్నారు.

కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్​కు దారి 


ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో రోడ్ షో చేస్తుండగా ఓ అంబులెన్స్ వచ్చింది. సైరన్ మోతలు విన్న ప్రధాని కాన్వాయ్​ని స్లో చేసి, అంబులెన్స్ కు దారి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో భద్రతా సిబ్బంది కాన్వాయ్​ని స్లో చేసి అంబులెన్స్ కు దారిచ్చారు. ప్రధాని కాన్వాయ్​ని దాటు కుంటూ అంబులెన్స్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.