- ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
- రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల అవార్డుల ప్రదానం
బషీర్‌బాగ్, వెలుగు : ప్రపంచంలో ఎన్నో భాషలున్నప్పటికీ, ఏ భాషతోనూ సంబంధం లేకుండా అందరికీ అర్థమయ్యే ఏకైక భాష ఫొటోనే అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఛాపెల్‌రోడ్డులోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో 23వ రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యాసం చెప్పలేని విషయాన్ని, ఉపన్యాసం వ్యక్తపరచలేని భావోద్వేగాన్ని ఒక నిశ్చల చిత్రం స్పష్టంగా చూపించగలదన్నారు.
ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి తీసిన ఒక ఫొటో చరిత్రను మార్చగలదని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలిపి ప్రజల సమస్యలను ప్రపంచానికి చాటగలదని వివరించారు. ఫొటో జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే టీఎస్ పీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నరహారి, ఉపాధ్యక్షుడు పి. రామ్ మూర్తి, కోశాధికారి కె. అనిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. వసంత్ కుమార్, ఎం.ఏ. సర్వర్, పి. మోహన్ చారి, అలీముద్దీన్, పి.హరికృష్ణ, ఏ.మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
