వరల్డ్ వాటర్ డే : ప్రతి నీటి బొట్టు .. బంగారమే

వరల్డ్ వాటర్ డే : ప్రతి నీటి బొట్టు .. బంగారమే

ఎడారి దేశమైన ఇజ్రాయెల్‌ తోపాటు సింగపూర్ నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వర్షపు నీటిని వంద శాతం సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే సౌతాఫ్రికా కూడా ఈ సమస్యను అధిగమించి చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించింది. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ వాన నీటి సంరక్షణ, సక్రమ వాడకంలో ముందంజలో ఉన్నాయి. తాగు, సాగు నీటి ప్రాధాన్యతను గుర్తించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణాన్ని , చెరువుల పునరుద్ధరణను చేపట్టాయి. సర్కార్లతోపాటు ప్రజలు కూడా నీటి సంరక్షణకు తమ వంతు కర్తవ్యంగా నడుం బిగించాలి. ప్రతి వాన నీటి బొట్టునీ ఒడిసి పట్టుకోవాలి. వర్షాలు జోరుగా పడాలంటే చెట్లు పెంచాలి. ప్రతి ఇల్లు, అపార్ట్ ​మెంట్, స్కూలు, కాలేజీ, ఆసుపత్రి, ఆఫీసు, షాపింగ్ కాంప్లె క్స్ , ఫాక్టరీ.. ఇలా ప్రతిచోటా బిల్డింగ్ లపై కురిసే వాన నీటిని ఫిల్టర్ చేసి బోరు బావుల్లోకి పంపటానికి ఏర్పాట్లు చేయాలి. బెంగళూరు, చెన్నైల్లో మునిసిపల్ కార్పొరేషన్లు చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తోంది.

వాన నీటి సంరక్షణ సక్రమంగా జరగాలంటే…

పరికరాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి. అవసరమైతే సబ్సిడీపై తక్కువ ధరకు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేట్లు చేయాలి. గతంలో ప్రభుత్వాలు ఇలా ఆలోచించకపోవటం వల్లే సహజ వనరు అయిన నీరు ఇప్పుడు వ్యాపార వస్తువుగా మారింది. డబ్బున్నవాళ్లకు కావాల్సి నంత దొరుకుతోంది. పేదలు కిలో మీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సి న పరిస్థితి తలెత్తింది. నీటిని పొదుపు చేస్తే సమాజానికి మేలు చేసినట్లే. ప్రకృతి ఇచ్చిన సంపద, వరం నీరు. అంత విలువైన నీటిని వృథా చేయటం ఒక విధంగా పాపం. నీరు సమృద్ధిగా ఉంటే సాగు బాగుంటుంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు , ధాన్యం బాగా పండుతాయి. అందరికీ పని, ఆహారం దొరుకుతాయి. డబ్బు సంపాదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి ఉపయోగాలెన్నో. నీటికి సహజ వనరులైన చెరువులను, సరస్సులను, నదులను మనం సంరక్షించుకోవాలి. వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువుల, కల్తీ పురుగు మందుల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.

బీహార్‌‌, పశ్చిమ బెంగాల్‌ లలో భూగర్భ జల మట్టా లు పూర్తిగా తగ్గిపోయాయి. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే వీల్లేక కుటుంబాలతో కలిసి నగరాలకు వలస వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 500కు పైగా మంచినీటి నదులు కలుషితమయ్యాయి. భారీ యుద్ధాల్లో చనిపోయిన సైనికుల కన్నా కలుషిత నీరు తాగి మరణించినవారే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి మృత్యువాత పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.