ఫస్ట్ విక్టరీ ఇంగ్లండ్ దే : సఫారీకి స్ట్రోక్స్

ఫస్ట్ విక్టరీ ఇంగ్లండ్ దే : సఫారీకి స్ట్రోక్స్

మెరుపు విన్యాసాలు, హోరాహోరీ పోరాటాల నిలయమైన వరల్డ్​కప్​ పేలవంగా మొదలైంది. టైటిల్​ ఫేవరెట్లలో ఉన్న రెండు మేటి జట్ల మధ్య సాదాసీదాగా జరిగిన తొలి పోరులో ఇంగ్లండ్ ​పై చేయి సాధించింది. సొంతగడ్డ అనుకూలతను ఆసరాగా చేసుకుంటూ బెన్​ స్టోక్స్​ (79 బంతుల్లో 9 ఫోర్లతో 89;  2/12) చేసిన ఆల్​రౌండ్​షోకు దక్షిణాఫ్రికా బెంబేలెత్తింది. బౌలింగ్​ బలగంతో ఇంగ్లీష్​​ జట్టును కట్టడి చేసిన సఫారీలు.. బ్యాటింగ్​లో మాత్రం కనీస పోరాటం కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్​ కుర్ర పేసర్​ ఆర్చర్​ (3/27) స్వింగ్​ దెబ్బకు కుదేలయ్యారు. మొత్తానికి తమ గడ్డపై ఎప్పుడు.. ఎలా ఆడాలో తెలిసిన ఇంగ్లండ్​ భారీ విజయంతో మెగా ఈవెంట్​లో ఓ అడుగు ముందుకేసింది.

104 పరుగుల తేడాతో ఇంగ్లండ్​ గెలుపు

స్టోక్స్​, రూట్​, రాయ్ ​హాఫ్​ సెంచరీలు    ఆర్చర్​కు 3 వికెట్లు

లండన్​:వరల్డ్​కప్​లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు​ శుభారంభం చేసింది. ఆల్​రౌండ్​షోతో అదరగొడుతూ.. గురువా రం జరిగిన లీగ్​ తొలి మ్యాచ్​లో 104 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మోర్గాన్​ (60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), జేసన్​ రాయ్​ (54), జో రూట్​ (51) అర్ధసెంచరీలు చేయడంతో.. టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన ఇంగ్లండ్​50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. డికాక్​(74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), డుసేన్​ (50) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ‌‌‌‌‌‌‌‌స్టోక్స్ కు ‘మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్​’ అవార్డు లభించింది.

తాహిర్​ తొలి దెబ్బ..

ఊహించని విధంగా తొలి ఓవర్​ వేసిన స్పిన్నర్​ తాహిర్​.. ఇన్నింగ్స్​రెండో బంతికే డేంజర్ మ్యాన్​ బెయిర్​స్టో (0)ను ఔట్​ చేసి షాకిచ్చాడు.  ఒక పరుగుకే తొలి వికెట్​ పడటంతో ఇన్నింగ్స్​ను ఆదుకునే బాధ్యతను రాయ్, రూట్ భుజాలకెత్తుకున్నారు. తాహిర్​ మూడు ఓవర్లు వేశాకా.. రెండు ఎండ్​ల నుంచి ఎంగిడి (3/66), రబాడ (2/66) అటాకింగ్​ మొదలుపెట్టారు. అయినా ఇంగ్లిష్​ జోడీ ఎక్కడా తడబడలేదు. నిలకడగా బౌండరీలు సాధిస్తూ తొలి 10 ఓవర్లలో 6 రన్​రేట్​తో 60/1 స్కోరు చేసింది.  పవర్​ప్లే తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. ఫెహుల్​క్వాయో (1/44), ప్రిటోరియస్ బౌలింగ్​లోనూ వీళ్లు ఎదురుదాడి కి దిగారు.  ఓవర్​కు ఓ బౌండరీ చొప్పున బాదుతూ రన్​రేట్​ తగ్గకుండా చూశారు. దీంతో 17 ఓవర్లలో ఇంగ్లండ్​ 100 పరుగులకు చేరింది. అదే క్రమంలో 18వ ఓవర్​లో నాలుగు బంతుల తేడాలో రాయ్​ (51 బంతుల్లో ), రూట్​ (56 బంతుల్లో ) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక ఇన్నింగ్స్​గాడిలో పడిందనుకునే సమయంలో ఆతిథ్య జట్టును సఫారీ పేసర్లు మళ్లీ దెబ్బకొట్టారు.

4 బంతుల్లో 2 వికెట్లు

నిలకడగా ఆడుతున్న రాయ్​.. 19వ ఓవర్​లో ఫెహుల్​క్వాయో బంతిని భారీ షాట్​గా మల్చాడు. కానీ బ్యాట్​ టాప్​ ఎడ్జ్​ తీసుకోవడంతో గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్​లో డుప్లెసిస్​ ఎడమవైపు డైవ్​ చేస్తూ కండ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. దీంతో రెండో వికెట్​కు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మూడు బంతుల తర్వాత రూట్​ ఇచ్చిన క్యాచ్​ బ్యాక్​వర్డ్​ పాయింట్​లో డుమిని నేర్పుగా అందుకున్నాడు. ఓవరాల్​గా నాలుగు బంతుల వ్యవధి, నాలుగు పరుగుల తేడాలో రెండు వికెట్లు పడటంతో 107/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ 111/3గా మారింది. ఈ దశలో వచ్చిన మోర్గాన్, స్టోక్స్ కుదురుకునేందుకు సమయం తీసుకున్నారు.  సఫారీ పేస్–స్పిన్​ కాంబినేషన్​ పరుగులు నిరోధించడంతో రన్​రేట్​ తగ్గింది. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ఎంగిడి వేసిన 26వ ఓవర్​లో మోర్గాన్​ రెండు టవరింగ్​ సిక్సర్లు బాదాడు. ఎక్కువగా స్ట్రయిక్​ రొటేట్ చేసిన ఈ జంట.. అడపాదడపా ఫోర్లతో ముందుకెళ్లింది. 32వ ఓవర్​లో మార్​క్రమ్​ బౌలింగ్​లో 4, 6తో రెచ్చిపోయిన స్టోక్స్​, మోర్గాన్.. రన్​రేట్​ పెంచే ప్రయత్నం చేశారు. మోర్గాన్… 37వ ఓవర్​లో తాహిర్​ బంతిని లాంగాన్​లోకి లేపగా మార్​క్రమ్​ రన్నింగ్​క్యాచ్​ అందుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్​కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 40 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్​ 235/4 స్కోరుతో పటిష్టస్థితిలో నిలిచింది. స్టోక్స్​ క్రీజ్​లో ఉండటంతో 350 స్కోరు ఖాయమని అనుకుంటున్న దశలో సఫారీ బౌలర్లు చెలరేగిపోయారు. పాత బంతిని రెండువైపుల స్వింగ్​ చేసిన ఎంగిడి, రబాడ​ వరుస విరామాల్లో బట్లర్​ (18), అలీ (3), వోక్స్​(13), స్టోక్స్​ వికెట్లను పడగొట్టి భారీ టార్గెట్​ను నిరోధించారు.

దక్కని ఆరంభం..

టార్గెట్​ ఛేజింగ్​లో సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఆరంభం నుంచి ఆతిథ్య బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో సఫారీ బ్యాట్స్​మన్​ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగో ఓవర్​లో ఆర్చర్ (3/27)​ వేసిన బౌన్సర్​.. హెల్మెట్​కు తాకడంతో ఆమ్లా రిటైర్డ్​హర్ట్​ అయ్యాడు. డికాక్​ నిలకడగా ఆడినా.. మార్​క్రమ్​ (11), డుప్లెసిస్​ (5) స్వల్ప విరామాల్లో ఔటయ్యారు.  దీంతో ప్రొటీస్​ 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. డికాక్​తో జతకలిసిన డుసేన్​ను మ్యాచ్​ మధ్యలో స్పిన్నర్లు రషీద్, అలీ బాగా కట్టడి చేశారు. బంతి  టర్న్​ కావడంతో డుసేన్​ సింగిల్స్​ తీయడంలో ఇబ్బందిపడినా.. డికాక్​ మాత్రం ఎదురుదాడి చేశాడు. అలీ, ఫ్లంకెట్​ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు బాది ‌‌‌‌‌‌‌‌58 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. సహచరుడిని చూసి స్ఫూర్తి పొందిన డుసేన్​ కూడా 22 వ ఓవర్​ (అలీ) 6, 4, 4తో 16 పరుగులు రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్​లోనే డికాక్ భారీ షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు.  ఫలితంగా మూడో వికెట్​కు ‌‌‌‌85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

నాలుగు బంతుల తేడాలో డుమిని (8), ప్రిటోరియస్​ (1) ఔటయ్యారు. దీంతో 129/2తో ఉన్న ప్రొటీస్​15 పరుగుల తేడాలో 3 కీలక వికెట్లు కోల్పోయి 144/5తో కష్టాల్లో పడింది. 56 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన డుసేన్​ పోరాటం మొదలుపెట్టినా.. 32వ ఓవర్​లో ఆర్చర్​ దెబ్బకు వెనుదిరిగాడు. ఉన్నంతసేపు వేగంగా ఆడిన ఫెహుల్​​క్వాయో (24) కూడా ఎక్కువసేపు వికెట్​ కాపాడుకోలేకపోయాడు. ఇక రిటైర్డ్​హర్ట్​నుంచి తిరిగొచ్చిన ఆమ్లా (13) ఫామ్​ను కొనసాగించలేకపోయాడు. రబాడ (11) పూర్తి ఒత్తిడితో బ్యాటింగ్​ చేశాడు.  ఈ ఇద్దరు స్ర్టయిక్​ రొటేట్​ చేసే సాహసం కూడా చేయకపోవడంతో చేయాల్సిన​ రన్​రేట్​ పెరిగిపోయింది. ఈ క్రమంలో  ఫ్లంకెట్ (2/37) ఓ షార్ట్​ బంతితో ఆమ్లా వికెట్ తీయడంతో సఫారీల పరాజయం ఖాయమైంది. చివర్లో ఎంగిడి (6 నాటౌట్​) సిక్స్​తో జోరు తెచ్చినా.. 40వ ఓవర్​లో స్టోక్స్ (2/12)​ డబుల్​ స్ర్టోక్​ ఇచ్చాడు. వరుస బంతుల్లో రబాడ, తాహిర్​(0)ను ఔట్​చేసి ఇన్నింగ్స్​కు ముగింపు పలికాడు.