సావరీన్ వెల్త్ ఫండ్కు రూ.3.53 లక్షల కోట్ల నష్టం

సావరీన్ వెల్త్ ఫండ్కు రూ.3.53 లక్షల కోట్ల నష్టం

నార్వే సెంట్రల్ బ్యాంకు నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద సావరీన్ వెల్త్ ఫండ్ భారీ నష్టానికి గురైంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు  నుంచి డిసెంబరు)లో దాని పోర్ట్ ఫోలియో పరిధిలోని దాదాపు రూ.3.53 లక్షల కోట్లు  ఆవిరయ్యాయి.  స్టాక్ మార్కెట్లలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు, వడ్డీరేట్ల పెరుగుదల వల్లే ఇలా జరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నార్వే ప్రభుత్వానికి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ నష్టపోయిన రూ.3.53 లక్షల కోట్లు.. దాని మొత్తం మార్కెట్ విలువలో 4.4 శాతానికి సమానం.

దీనిపై నార్వే సెంట్రల్ బ్యాంక్ తో పాటు ఫండ్ కు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రాండ్ గ్రాండే అధికారిక ప్రకటన విడుదల చేశారు. నార్వే ప్రభుత్వానికి చమురు వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ సావరీన్ ఫండ్ లో పెట్టుబడి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,400 కంపెనీల్లో ఈ సావరీన్ వెల్త్ ఫండ్ పెట్టుబడులు పెట్టడం గమనార్హం.  సెప్టెంబరు చివరివారం నాటికి ఈ ఫండ్ మొత్తం మార్కెట్ విలువ రూ.97 లక్షల కోట్లకుపైనే.