వందేళ్లు కాదు.. లక్ష ఏళ్లు కాదు.. ఏకంగా 38 కోట్ల ఏళ్ల కిందటి చేప గుండెకు సంబంధించిన శిలాజం దొరికింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఉన్న క్యూర్టిన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ ప్రాచీన శిలాజాన్ని గుర్తించింది. ఈ గుండె శిలాజం ‘గోగో’ జాతి చేపదని వెల్లడించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో గోగో రాక్ ఫార్మేషన్ ఉంది. అందులో తవ్వకాలు జరిపే క్రమంలో సైంటిస్టులకు కోట్ల ఏళ్ల కిందటి చేపల అవయవాలు, కాలేయం, పొట్ట, పేగులు, గుండెకు సంబంధించిన శిలాజాలు లభించాయి.
గోగో జాతి చేపలకు కూడా దవడలు, దంతాలు ఉండేవని సైంటిస్టులు చెప్పారు. అవి ఇంచుమించు 29.5 ఫీట్ల (9 మీటర్ల) పొడవు ఉండేవని తెలిపారు. వాటి కంటే ముందు మనుగడలో ఉన్న చేపల జాతుల సైజు 30 సెంటీమీటర్లకు మించి ఉండేది కాదన్నారు. భూమిపై డైనోసార్ల పుట్టుకకు దాదాపు 10 కోట్ల సంవత్సరాలకు ముందు గోగో జాతి చేపలు మనుగడలో ఉండేవన్నారు. గోగో జాతి చేపల గుండె ‘ఎస్’ ఆకారంలో.. కొంతమేర మనుషుల గుండెను తలపించేలా ఉండేదని సైంటిస్టులు చెప్పారు. వాటి గుండెలో ఒకదానిపై ఒకటిగా రెండు గదులు ఉండేవని వివరించారు. గోగో జాతి చేప గుండెకు సంబంధించిన 3డీ ఇమేజ్ ను సైంటిస్టులు విడుదల చేశారు. మానవ జాతి పరిణామ క్రమానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించేందుకు ఈ అధ్యయన నివేదిక ఎంతో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆక్టోపస్, స్క్విడ్స్ కు 3 గుండెలు
చాలా జంతువులకు ఒకే గుండె ఉంటుంది. అయితే కొన్నింటికి ఒకటికి మించి గుండెలు కూడా ఉంటాయి. ఇంకొన్నింటి గుండె అస్సలు ఉండదు. ఆక్టోపస్, స్క్విడ్ చేపలకు మూడు గుండెలు ఉంటాయి. వీటిలో ఒక గుండె నుంచి వాటి మొత్తం శరీరానికి రక్తం పంప్ అవుతుంది. మిగతా రెండు గుండెల నుంచి మొప్పలకు రక్తం సరఫరా జరుగుతుంది.
