ప్రపంచ కురు వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచ కురు వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యక్తిగా భావిస్తున్న రష్యా మహిళ టాంజిలియా బిసెంబెయేవా కన్నుమూశారు.123 సంవత్సరాల వయసున్న ఈ బామ్మ సౌత్ రష్యాలోని తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని, కుటుంబ మెమోరియల్‌ లో ఆమెను ఖననం చేశారని అధికారులు తెలిపారు. ఆమె అంతిమయాత్రను వీక్షించేందుకు గ్రామం మొత్తం తరలివచ్చిందని చెప్పారు. టాంజిలియా బిసెంబెయేవా 1896 మార్చి 14న జన్మించినట్టు చెబుతున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు కాగా, పది మంది మనుమలు, 13 మంది మునిమనుమలు, మరో ఇద్దరు మునిమనుమల కుమారులున్నారని తెలిపింది ఫ్యామిలీ.

2016లో  టాంజిలియా బిసెంబెయేవా 120 సంవత్సరాల వయసుతో ప్రపంచంలోనే జీవిస్తున్న అతిపెద్ద వయస్కురాలిగా అధికారికంగా గుర్తించినట్టు రష్యన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తెలిపింది.

బామ్మ చనిపోయినప్పట్నుంచీ ఆమె లైఫ్ స్టైల్ గురించి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె ఫ్యామిలీ. ఆమె ఎప్పుడూ కుదురగా కూర్చోదని, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారని అదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమని చెప్పుకొచ్చారు. ఆమె పులియబెట్టిన పాలు ఎక్కువగా తీసుకునేవారని.. తొలిసారిగా డాక్టర్ ని సంప్రదించినప్పుడే ఆమెకు వందేళ్లు పైబడ్డాయని చెప్పారు ఈ రోజుల్లో తుమ్మితే చాలు..దగ్గితే చాలు డాక్టర్ ను సంప్రదిస్తాం. కనీసం 2 నెలలకొకసారైనా హెల్త్ చెకప్ చేస్తుంటాం. కానీ 100 సంవత్సరాలుగా అసలు డాక్టర్ నే సంప్రదించలేదంటే అప్పటి మనుషులు ఎంత స్ట్రాంగో అని చెప్పడానికి ఈ బామ్మే నిదర్శనం అంటున్నారు.