- ప్రపంచ పాల ఉత్పత్తిలో 22శాతం మన దేశంలోనే
మానవుల దైనందిన జీవిత ఆహారంలో ఒక భాగంగా మారిన పాల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సమాచారం ప్రకారం గడచిన మూడు దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తి 59%కు పైగా వృద్ధి చెందింది. 1988లో 530 మిలియన్ టన్నులుగా ఉంటే 2018 నాటికి అది 843 మిలియన్ టన్నులకు చేరింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశాలలో ఇండియా అగ్రగామిగా ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో 22శాతం ఇక్కడ జరుగుతుంది. ప్రపంచంలో గేదె పాలను దాదాపు 80 శాతం ఇండియా మరియు పాకిస్తాన్‌లు ఉత్పత్తి చేస్తుంటే అనుసరించి చైనా, ఈజిప్ట్, నేపాల్ ఉన్నాయి. భారతదేశంలోని పరిస్థితి గురించి చెప్పాలంటే పాలంటే కేవలం ఆహారం లేదంటే పోషణకు అవసరమైన ఓ పదార్థం మాత్రమే కాదు అది ఓ జీవన విధానంలా మారిపోయింది. వేడుకలు, నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కడైనా సరే పాలను వినియోగించాల్సిందే. ఉత్పత్తి పరంగా మాత్రమే కాదు వినియోగం పరంగా కూడా ఇండియా అత్యధికంగా పాలను వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
