టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా తడబడుతున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో డకౌటై తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పియాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిషేక్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అభిషేక్ శర్మను 2026, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరగనున్న కీలక పోరు నుంచి తప్పించాలని సూచించాడు. భారత్‌కు డూ ఆర్ డైగా మారిన ఈ మ్యాచులో అభిషేక్ స్థానంలో సంజు శాంసన్‌ను ప్లేయింగ్ లెవన్లోకి తీసుకోవాలన్నాడు. ఇండియాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమని.. ఒకవేళ ఓడిపోతే మెగా టోర్నీలో ఇండియా టైటిల్ వేట ముగుస్తుందన్నాడు.
ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా బీసీసీఐ తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలని సూచించారు. అనారోగ్యం, ఫామ్ లేమితో బాధపడుతోన్న యువ ఓపెనర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని చెప్పాడు. అభిషేక్ తో పాటు తిలక్ వర్మ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తుందన్నారు. తిలక్ అంచనాల మేర రాణించడంలో విఫలం అవుతున్నాడని పేర్కొన్నారు.
నాకౌట్ రౌండ్‌కు ముందే టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠ భరితమైన దశకు చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా ఒకే ఒక్క ఓటమితో టోర్నీలో చావోరోవో తేల్చుకునే పరిస్థితిలో నిలిచింది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన సూపర్–8 రౌండ్ మ్యాచ్‌లో గురువారం ఇక్కడి చెపాక్ స్టేడియంలో జరిగే సంచలనాల జట్టు జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది.
సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఇండియా నెట్ రన్ రేట్ (–-3.80) దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ సేనకు జింబాబ్వేపై గెలుపు మాత్రమే సరిపోదు. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది.
