WPL 2024: నేటి నుంచే మహిళా ప్రీమియర్ లీగ్.. 500 మందికి ఉచిత ప్రవేశం

WPL 2024: నేటి నుంచే మహిళా ప్రీమియర్ లీగ్.. 500 మందికి ఉచిత ప్రవేశం

మరికొన్ని గంటల్లో మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. మిగిలిన మ్యాచ్‌లన్నీ 7.30 నుంచి మొదలవుతాయి. ఇదిలావుంటే, మొదటి మ్యాచ్‌కు 500 మందికి ఉచిత ప్రవేశం కలిపించాలని బీసీసీఐ నిర్ణయించింది.

మొదట వచ్చిన వారికే అవకాశం

500 మందికి అనగానే పురుషులు సంబరపడిపోకండి.. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే. అందునా మొదటి 500 మందికే ఈ అవకాశం ఉంటుంది. P3 Annexe స్టాండ్ నుండి ఉచిత ప్రవేశం ఉన్నవారిని అనుమతిస్తారు. బెంగుళూరులో మీ స్నేహితులు, బంధువులు ఉంటే ఈ ఆఫర్ గురుంచి తెలియజేయవచ్చు.

ఘనంగా ఆరంభ వేడుకలు 

శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఆరంభ వేడుకలు మొదలవుతాయి. పలువురు సెల‌బ్రిటీల‌ డాన్స్ షోలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. షారుక్‌తో పాటు షాహిద్ క‌పూర్, కార్తిక్ ఆర్య‌న్‌, సిద్దార్థ్ మల్హోత్రా, వ‌రుణ్ ధావ‌న్, టైగ‌ర్ ష్రాఫ్‌ల డాన్స్‌ షోలు ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. 

మొత్తం 5 జట్లు: ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్‌ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్.