
హనుమకొండ/కేయూ క్యాంపస్, వెలుగు: పుస్తకాలతో కుస్తీ పట్టి.. ప్లే గ్రౌండ్లో చురుకుగా కదలాల్సిన క్రీడాకారులు లేబర్ అవతారమెత్తిన్రు. లేబర్ తో పనులు చేయించాల్సిన ఆఫీసర్లు స్టూడెంట్స్‌ను కూలీలుగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 20 వరకు సౌత్ ఇండియా విమెన్ ఖోఖో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సౌత్ ఇండియాలోని 8 రాష్ట్రాల నుంచి 60 యూనివర్సిటీలకు చెందిన దాదాపు వెయ్యి మంది స్టూడెంట్స్తరలిరానున్నారు. ఇందుకోసం కేయూ గ్రౌండ్‌ను రెడీ చేయాల్సి ఉంది. గ్రౌండ్‌ను ఆటలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ ఆఫీసర్లు ప్రత్యేకంగా నిధులు కూడా రిలీజ్ చేశారు. కానీ స్పోర్ట్స్ బోర్డు ఆఫీసర్లు పైసా ఖర్చు లేకుండా క్యాంపస్‌లోని బీపీఎడ్(బ్యాచ్ లర్ఆఫ్ ఫిజికల్‌ఎడ్యుకేషన్) స్టూడెంట్స్ తో చేయించారు. మూడు రోజులుగా పనులు చేయిస్తుండటంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. అది తమ పని కాదని ఆఫీసర్లకు ఎదురు చెబితే.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోతున్నారు. దీంతో ఏబీవీపీ నేతలు బుధవారం ఉదయం స్పోర్ట్స్ బోర్డు ఆఫీస్ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయమై స్పోర్ట్స్సెక్రటరీ సవితా జోత్స్నను వివరణ కోరగా.. బీపీఎడ్ స్టూడెంట్లతో గ్రౌండ్‌ను చదును చేయించినట్లు తెలిపారు. మట్టి పోసి చదును చేయడం వల్ల పిల్లలకు గ్రౌండ్‌పై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.