
వయసు చిన్నదైనా కొందరికి కళ్ల కింద ముడతలు వచ్చి, ఉబ్బినట్టు అవుతుంది. దాంతో వయసుకు మించి కనిపిస్తారు. ఎన్ని చిట్కాలు ఫాలో అయినా ఏ మార్పూ ఉండదు. దానికి కారణం మనకున్న కొన్ని అలవాట్లే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఏ అలవాట్లు మానేస్తే యంగ్‌గా కనిపిస్తారంటే..
- కరోనా వల్ల నెలల తరబడి ఇంట్లోనే ఉండటం వల్ల సెల్‌ఫోన్, కంప్యూటర్లు, టీవీ చూడటం పెరిగాయి. దీంతో బ్లూలైట్ ముఖం మీద ఎక్కువగా పడటం వల్ల ముఖంపై ముడతలు ఎక్కువై ముసలి వాళ్లలా కనిపిస్తారు. అలాకాకుండా ఉండాలంటే స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా మీటింగ్స్ ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అయ్యాయి. దాంతో స్క్రీన్ టైం పెరిగిపోతోంది. అది చాలదన్నట్టు టీవీ చూడటం, సోషల్ మీడియాలో ఉండటం వంటివి చేస్తే స్క్రీన్ టైం పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకని టీవీ, మొబైల్‌ఫోన్ పక్కన పెట్టడం మంచిది.
- ఆరోగ్యంగా ఉండాలంటే, కచ్చితంగా రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్. నీళ్లు తక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. దానివల్ల కళ్లచుట్టూ నల్లగా అవ్వడం, చర్మం ముడతలు పడటం లాంటివి జరుగుతాయి. రోజూ తగినన్ని నీళ్లు తాగితే చర్మం బ్రైట్‌గా అవుతుంది. యంగ్‌గా కనిపిస్తారు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
- స్ట్రెస్ ఎక్కువకావడం, నిద్రలేకపోవడం వంటివి కూడా చర్మంపైన బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. నిద్రపోతున్న టైంలో బాడీ రిలాక్స్ అవుతుంది. అప్పుడు స్కిన్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే చక్కగా నిద్రపోతారో అప్పుడే స్కిన్ హెల్దీగా ఉంటుంది.
- చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేందుకు కొల్లాజు, ఎలాస్టిన్ రెండూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, ఎక్కువగా స్వీట్స్ తినడం వల్ల ఆ రెండూ తగ్గిపోతాయి. అమైనో యాసిడ్స్ లాంటివి పెరగడం వల్ల స్కిన్ దెబ్బతింటుంది.
- పొగాకులో ఉండే విషపదార్థాలు చర్మంలో ఆక్సిజన్, వైటల్ న్యూట్రి సర్క్యులేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో కొత్త కణాలు ఏర్పడవు. ముఖంలో ముసలితనం కనిపిస్తుంది.
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలో తేమశాతం తగ్గిపోతుంది. దాంతో మంటపుట్టడం, మొటిమలు రావడం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. వాటితో పాటు కళ్లకింద ముడతలు ఏర్పడతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నుదుటి భాగంలో కూడా ముడతలు వస్తాయని చాలా స్టడీల్లో తేలింది.