డ‌బ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో డ్యూక్స్‌ బాల్.. ఈ బంతి ప్ర‌త్యేక‌తలు ఇవే!

డ‌బ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో డ్యూక్స్‌ బాల్.. ఈ బంతి ప్ర‌త్యేక‌తలు ఇవే!

ఐపీఎల్ పోరు ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ప్ర‌పంచ టెస్టు చాంపిన‌య‌న్‌షిప్ ఫైనల్ వైపే. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య డ‌బ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచులో 'డ్యూక్స్‌ బాల్' అనే ఓ ప్రత్యేకమైన బంతిని ఉప‌యోగించ‌నున్నారు. టెస్టుల్లో వాడే సాధారణ ఎస్‌జీ బాల్ కంటే ఇది చాలా ప్రత్యేకమైనది. చారిత్ర‌క ప్రాధాన్యం కలది. చూడడానికి ఒకేలా క‌నిపించినా.. ఈ రెండింటి మ‌ధ్య చాలా తేడాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1760లలోనే తొలిసారి..

డ్యూక్స్‌ బంతి పురాతన చారిత్ర‌క ప్రాధాన్యం కలది. క్రికెట్ ఆట పుట్టిన తొలినాళ్ల‌లో అంటే.. 1760లలోనే దీన్ని ఉప‌యోగించేవార‌ట‌. అంటే 250 ఏళ్లు గ‌డిచినా దీని క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈ బంతిని ఇంగ్లండ్‌లోని డ్యూక్స్‌ క్రికెట్ కంపెనీ త‌యారుచేస్తుంది. ప్ర‌స్తుతం ఈ కంపెనీని భార‌త సంతతి వ్యాప‌ర‌వేత్త దిలీప్ జ‌జోడియా న‌డిపిస్తున్నాడు. ఈ బంతిని ఇంగ్లండ్‌తో పాటు, వెస్టిండీస్ మరియు ఐర్లాండ్‌లు కూడా ఉపయోగిస్తున్నాయి.

దీనికి, మామూలుగా టెస్టుల్లో ఉప‌యోగించే ఎర్ర బంతి(ఎస్‌జీ)కి చాలా తేడా ఉంటుంది. సాధారణ ఎర్ర బంతితో పోలిస్తే.. డ్యూక్స్‌ బాల్ దృఢంగా ఉంటుంది. త్వరగా మెరుపును కోల్పోదు. అలాగే, ఎక్కువ సేపు త‌న ఆకారాన్ని కోల్పోదు. ఈ బాల్ రెండు వైపులా వెన‌క నుంచి ముందుకు ఆరు కుట్లు స్పష్టంగా క‌నిపిస్తాయి. అదే ఎర్ర బంతి మీద అయితే దారం పోగులు ద‌గ్గ‌ర దగ్గ‌ర‌గా ఉంటాయి. ఇక ఇతర దేశాల విషయానికొస్తే.. భారత్ ఎస్‌జీ ర‌కం బంతులను ఉపయోగిస్తుండగా, టెస్టులు ఆడే మిగ‌తా దేశాలు ఆస్ట్రేలియాలో త‌యారయ్యే కొకాబుర్రా బంతుల‌ను వాడ‌తాయి. ఎస్‌జీ ర‌కం బంతుల‌ను మీర‌ట్‌కు చెందిన  సాన్స్‌పేరిల్ గ్రీన్‌ల్యాండ్స్ కంపెనీ త‌యారు చేస్తోంది.