టాస్​ కూడా పడకుండా ఆగిపోయిన డబ్ల్యూటీసీ ఫైనల్‌

 టాస్​ కూడా పడకుండా ఆగిపోయిన డబ్ల్యూటీసీ ఫైనల్‌
  • ఫైనల్​ ఫస్ట్​ డే వాష్​ఔట్​
  • టాస్​ కూడా పడనివ్వని వాన
  • రిజర్వ్​ డేన ఆట కొనసాగే చాన్స్​
  • నేడు కూడా వాన ముప్పు!

టాస్‌ ఎవరు గెలుస్తారు?  బ్యాటింగ్‌ ఎవరిది?  ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే ఇండియా ఓపెనర్లు హిట్‌ అవుతారా?  బౌలింగ్‌కు వస్తే.. బుమ్రా, షమీ, ఇషాంత్‌ మెరిపిస్తారా? తొలి రోజు ఎవరి జోరు సాగుతుంది..?  ఇలా ఎన్నో అంచనాలతో, మరెన్నో ఆశలతో ఇండియా–న్యూజిలాండ్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్​కు వాన దేవుడు పరీక్ష పెట్టాడు..! గంట, రెండు గంటలు.. ఇలా టైమ్ గడుస్తున్నా ప్లేయర్లను గ్రౌండ్‌లోనే అడుగు పెట్టనివ్వలేదు..! ఫలితంగా కనీసం టాస్‌ కూడా పడకుండానే ఫస్ట్  డే మొత్తం రద్దయింది..! మ్యాచ్‌ జరిగే రోజుల్లో ఎప్పుడో ఓసారి వర్షం వస్తుందని ముందునుంచే అనుకుంటున్నా.. ఇలా ఓ రోజు మొత్తాన్ని వాన ముంచేస్తుందని, అది తొలి రోజే అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు..! రిజర్వ్‌ డే ఉండటంతో శనివారం నుంచి ఐదు రోజుల ఆట ఆశించొచ్చు..! కానీ,  మిగతా రోజుల్లో కూడా వర్షం కురిసే చాన్స్‌ ఉండటమే ఆందోళన కలిగిస్తోంది..!  ఇలాంటి వాతావరణం ఉన్న చోట ఇంత పెద్ద మ్యాచ్‌ను ఎందుకు ప్లాన్‌ చేశారంటూ ఐసీసీపై సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ గుస్సా అవుతుతున్నారు..! 

సౌతాంప్టన్‌‌: వరల్డ్​ టెస్ట్ చాంపియన్​షిప్​ఫైనల్‌‌ (డబ్ల్యూటీసీ) కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్​ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. సౌతాంప్టన్​ వేదికగా ఇండియా, న్యూజిలాండ్​ మధ్య ​శుక్రవారం  మొదలవ్వాల్సిన ఫైనల్​ మ్యాచ్​కు భారీ వర్షం అడ్డుపడింది. దీంతో  తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయ్యింది. భారీ అంచనాలున్న ఈ మ్యాచ్​లో..కనీసం టాస్​కు కూడా వాన దేవుడు చాన్స్​ ఇవ్వలేదు. ఎడతెరిపి లేని వానకు తోడు బ్యాడ్​లైట్​ వల్ల అంపైర్లు తొలి రోజు ఆటను క్యాన్సిల్​ చేశారు. సౌతాంప్టన్​లో గురువారం మొదలైన వర్షం శుక్రవారం కూడా విడతల వారీగా కొనసాగింది. ఇండియా టైమ్​ ప్రకారం మ్యాచ్​ మధ్యాహ్నం మూడు గంటలకు ఆట  ప్రారంభం కావాల్సింది. కానీ షెడ్యూల్​ టైమ్​ కంటే ముందే ఫస్ట్​ సెషన్​ క్యాన్సిల్​ అయ్యింది. ప్లేయర్లు డ్రెసింగ్​ రూమ్​కు చేరుకొని ఎంత సేపు ఎదురుచూసినా వరుణుడు కరుణ చూపకపోవడంతో లంచ్​బ్రేక్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇండియా టైమ్‌‌ ప్రకారం రాత్రి ఏడున్నరకు తొలి రోజు ఆట క్యాన్సిల్​ అయినట్టు అఫీషియల్స్​ప్రకటించారు. రోజ్​ బౌల్​ స్టేడియంలో వరల్డ్​ క్లాస్​ డ్రైనేజీ ఉన్నా... గ్రౌండ్​లో అడుగుపెట్టే చాన్స్​ లేకుండా పోయింది.  ఔట్‌‌ఫీల్డ్‌‌ మొత్తం నీళ్లు ఉండటంతో ప్లేయర్లు షూ తీసేసి నడిచారు. టైం పాస్​ కోసం ఇండియా ప్లేయర్లు డ్రెస్సింగ్​ రూమ్​లో గేమ్​ ఆఫ్​ డార్ట్​ ఆడుతూ కనిపించారు. కాగా, వెదర్​ రిపోర్ట్స్​ ప్రకారం శనివారం  మధ్యాహ్నం తర్వాత సౌతాంప్టన్​లో వర్షం కురిసే అవకాశం ఉంది.  శుక్రవారం రాత్రి, తెల్లవారుజామున వాన లేకపోతే.. సెకండ్‌‌ డే మార్నింగ్‌‌ టాస్‌‌ పడి ఆట మొదలయ్యే చాన్సుంది.

రిజర్వ్​ డే పక్కా..
డబ్ల్యూటీసీ ఫైనల్లో కచ్చితంగా రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో ఐసీసీ రిజర్వ్​ డేను ముందుగానే ప్రకటించింది​. 23వ తేదీని రిజర్వ్​ డే గా కేటాయించారు. రిజర్వ్​ డే ను ఉపయోగించుకోవాలా వద్దా అనే నిర్ణయం అంపైర్లకే ఉంటుంది. అయితే, రిజర్వ్​ డే అనేది ఎక్స్​ ట్రా డే కాదని ప్లేయింగ్​ కండిషన్స్​లో ఐసీసీ స్పష్టంగా పేర్కొంది.  సాధారణంగా  టెస్ట్​ మ్యాచ్​ల్లో ఏదైనా కారణం వల్ల  మ్యాచ్​లో ఒక రోజు ప్లేయింగ్​అవర్స్​ను కోల్పోతే  మరుసటి రోజు దానిని కవర్​ చేస్తారు. అయితే, తొలి రోజే కనీసం ఆరు గంటల ఆట వృథా అయింది. రూల్స్​ ప్రకారం సెకండ్ డే నుంచి అరగంట అదనంగా (8 ఓవర్లు) ఆడించినా  నాలుగు గంటలే కవర్​ అవుతాయి. పైగా, మిగతా రోజుల్లోనూ వర్షం పడే చాన్స్​ ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్​ డేను ఉపయోగించుకోవడం పక్కా అని అర్థం అవుతోంది. అయితే, ఐసీసీ చెప్పిన దాని ప్రకారం డబ్యూటీసీ ఫైనల్లో కోల్పోయిన ప్లేయింగ్​ అవర్స్ గురించి  మ్యాచ్​ రిఫరీ ఏరోజుకు ఆరోజు ప్రకటన చేస్తాడు. ఈ లెక్కన మిగిలిన నాలుగు రోజుల ఆట ప్రకారమే రిజర్వ్​ డేపై నిర్ణయం ఉంటుంది. ఐదో రోజు అంటే గురువారం నాడు రిజర్వ్​ డేపై  ఫుల్​ క్లారిటీ వస్తుంది. ఇక, రిజర్వ్​ డే ఉపయోగించినా ఫలితం తేలక డబ్ల్యూటీసీ ఫైనల్​ డ్రాగా ముగిస్తే ఇరుజట్లను జాయింట్​ విన్నర్స్​గా ప్రకటిస్తారు.

ఫైనల్ టీమ్‌‌లో మార్పులు ఉండవు: శ్రీధర్‌‌
వర్షం కారణంగా ఒక రోజు ఆటను కోల్పోయినప్పటికీ తమ ఫైనల్​ టీమ్​లో మార్పులు ఉండవని టీమిండియా ఫీల్డింగ్ కోచ్​ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. ‘కండిషన్స్‌‌తో  సంబంధం లేకుండా పెర్ఫామ్ చేయగలిగే 11 మందినే ఎంపిక చేశాం. వెదర్ ఎలా ఉన్నా, వికెట్ ఎలాంటిదైనా మా వాళ్లు అదరగొట్టగలరు. ఏదైనా అత్యవసరమైతే తప్ప మార్పులుండవు. మ్యాచ్​ను​ ఎలా నిర్వహించాలో ఐసీసీకి బాగా తెలుసు. మిగిలిన ఆట సజావుగా సాగితే రిజర్వ్ డే న నాలుగు గంటల పాటు ఆట ఉంటుందని అనుకుంటున్నాం. మాతోపాటు ఫ్యాన్స్ కూడా మ్యాచ్ రిజల్ట్ రావాలనే కోరుకుంటున్నారు’ అని చెప్పాడు. 

ఫ్యాన్స్‌‌ గుస్సా
ఫస్ట్ సెషన్ ఆలస్యమైనప్పటి నుంచి సోషల్‌‌ మీడియాలో ఐసీసీపై విమర్శల వర్షం మొదలైంది. ఈ సీజన్‌‌ ఇంగ్లండ్‌‌లో  ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిసి కూడా ఇంత పెద్ద మ్యాచ్‌‌ను అక్కడ ఎలా షెడ్యూల్ చేశారంటూ ఐసీసీపై ఫ్యాన్స్​ విరుచుకుపడ్డారు. 2013, 2017 చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్స్‌‌, గతేడాది వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సెమీఫైనల్స్‌‌ కూడా ఇలానే వర్షం వల్ల ప్రభావితం అయ్యాయి. ఆ అనుభవంతో అయినా ఈ మ్యాచ్‌‌ను పక్కాగా ప్లాన్‌‌ చేయాల్సిందని అంటున్నారు. అయితే, తొలుత లార్డ్స్‌‌లో నిర్వహించాలనుకున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ను బీసీసీఐ సూచన మేరకే ఐసీసీ సౌతాంప్టన్‌‌కు షిఫ్ట్‌‌ చేసింది. ఇక్కడి స్టేడియంలోనే ఫైవ్‌‌ స్టార్‌‌ ఫెసిలిటీస్‌‌తో కూడిన హోటల్‌‌ ఉండటంతో బయో బబుల్‌‌ క్రియేట్‌‌ చేయడం ఇంగ్లండ్‌‌ బోర్డు, ఐసీసీకి తేలికైంది. ఇక, ఇంగ్లండ్‌‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఏ వేదికలో మ్యాచ్‌‌కు అయినా గ్యారంటీ ఉండదు. అయితే, గత ఐదేళ్లలో ఇంగ్లండ్‌‌ 32 మెన్స్‌‌ టెస్టులకు ఆతిథ్యం ఇవ్వగా.. వాటిలో నాలుగు మాత్రమే డ్రా అయ్యాయి. ఈ లెక్కన వర్షంతో ఆటకు అంతరాయం కలిగినా.. ఈ ఫైనల్‌‌ మ్యాచ్‌‌ పూర్తిగా జరిగి రిజల్ట్‌‌ వస్తుందనుకోవచ్చు.