గుండె ముప్పును చెప్పే ఎక్స్ రే

గుండె ముప్పును చెప్పే ఎక్స్ రే

వాషింగ్టన్: ఒక్క ఎక్స్​రే.. ఇప్పటికే తీసుకున్నదైనా, ఇప్పుడు తీయించుకున్నా సరే భవిష్యత్తులో మీరు గుండె జబ్బుల బారిన పడే ముప్పును చెబుతుందని అమెరికా సైంటిస్టులు తెలుపుతున్నారు. ఇందుకోసం అత్యాధునిక కృత్రిమ మేధను తయారుచేసినట్లు మసాచుషెట్స్ సైంటిస్టులు వెల్లడించారు. సీఎక్స్ ఆర్​సీవీడీ రిస్క్​ గా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థను సుమారు 40 వేల మందికి పైగా వలంటీర్లపై పరీక్షించి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. ఎక్స్​రే ను పరిశీలించడం ద్వారా వచ్చే పదేళ్లలో గుండె జబ్బుల ముప్పును ఈ వ్యవస్థ అంచనా వేస్తుందని వివరించారు. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బాధితులు గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. ఈ పరిశోధనకు వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) నివేదికే కారణమని  మసాచుషెట్స్ కార్డియోవాస్క్యులర్​ ఇమేజింగ్​ రీసెర్చ్​ సెంటర్​ రేడియాలజిస్టు డాక్టర్​ జాకోబ్​ వెయిస్​ తెలిపారు.

ఏటా 1.70 కోట్ల మంది మృతి..

ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులతో చనిపోయేవాళ్ల సంఖ్యే ఎక్కువని, ఏటా కోటీ 70 లక్షల మంది ఈ జబ్బుతోనే హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్​వో నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తాము నడుము బిగించినట్లు జాకోబ్​ పేర్కొన్నారు. కృత్రిమ మేధలో అత్యాధునిక రకమైన డీప్​ లెర్నింగ్​ టెక్నాలజీని తయారుచేసి 40,643 మంది వలంటీర్లకు చెందిన 1,47,497 ఎక్స్​రేలను పరిశీలించినట్లు తెలిపారు. నేషనల్​ క్యాన్సర్​ ఇనిస్టిట్యూట్​ లో వివిధ రకాల క్యాన్సర్​ స్క్రీనింగ్​ కోసం వచ్చిన బాధితులకు సంబంధించిన ఎక్స్​రేలను ఈ పరిశోధనకు ఉపయోగించినట్లు ​ జాకోబ్​ వివరించారు.

ఇప్పుడున్న పరీక్షలు సంక్లిష్టం..

గుండె జబ్బులను ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులో ఉంది.. వయసు, సిస్టాలిక్​ బ్లడ్​ ప్రెషర్, హైపర్​ టెన్షన్​ చికిత్స ట్రీట్​మెంట్, పొగ తాగే అలవాటు, టైప్​–2 డయాబెటిస్, పలు రకాల రక్త పరీక్షల వివరాలు పరిశీలించి గుండె జబ్బు ముప్పును అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొన్ని వివరాలు అందుబాటులో లేకుంటే వచ్చే ఫలితాలలో కచ్చితత్వం తగ్గుతుందని వివరించారు. దీనిపై డాక్టర్​ జాకోబ్​ మాట్లాడుతూ.. హృద్రోగ సమస్యలను ముందే గుర్తించేందుకు ఇప్పుడున్న వ్యవస్థ చాలా కష్టతరమైనదని కామెంట్​ చేశారు. దీనికన్నా ఎక్స్​ రే చూసి రాబోయే ముప్పును గుర్తించడం చాలా తేలికైనదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏడాదికో రెండేళ్లకో చెస్ట్  ఎక్స్​రే తీసుకోవడం సాధారణమేనని చెప్పారు. ఆ ఎక్స్​రేను పరీక్షించి గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్నోళ్లను గుర్తించి, ముందుజాగ్రత్తలు సూచించడం, అవసరమైన మందులు ఇవ్వడం ద్వారా హృద్రోగాలతో మరణించే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్​ వెయిస్​ జాకోబ్​ పేర్కొన్నారు.

రెండో దశలో 11 వేల మందిపై

రెండో దశలో 11,430 మంది వలంటీర్లపై ఈ సీఎక్స్ ఆర్​సీవీడీ వ్యవస్థను పరీక్షించి చూసినట్లు డాక్టర్​ జాకోబ్​ తెలిపారు. బ్రిగ్​హాం జనరల్​ ఆస్పత్రికి వచ్చిన ఔట్​ పేషెంట్లు రొటీన్​ చెకప్​ లో భాగంగా తీయించుకున్న ఎక్స్​రేలను ఈ పరీక్షకు ఉపయోగించామన్నారు. ఇందులో 1,096 మంది వచ్చే పదేళ్లలో గుండెజబ్బుల బారిన పడతారని తేలగా.. సంబంధిత వ్యక్తులు అదేవిధంగా ఆస్పత్రి పాలవడమో, గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోవడమో జరిగిందని ఆయన​ తెలిపారు. ఈ ప్రయోగం వివరాలను, పరిశోధనా ఫలితాలను రేడియలాజికల్​ సొసైటీ ఆఫ్ నార్త్​ అమెరికా యాన్యువల్​ మీటింగ్(ఆర్ఎస్ఎన్ఏ)లో ప్రదర్శించామని జాకోబ్​ పేర్కొన్నారు.