
- 20 మంది ప్రపంచ దేశాల నేతలకు ఇన్విటేషన్
- గ్లోబల్ సౌత్ దేశాలకు సంఘీభావంగా పవర్ఫుల్ షో
బీజింగ్: అమెరికా టారిఫ్‌ల వేళ చైనా పవర్ఫుల్ షోకు సిద్ధమైంది. ఈ నెలాఖారునుంచి తియాంజిన్ లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)ను ఇందుకు వేదికగా చేసుకుంటున్నది. ఈ సదస్సుకు రానున్న భారత ప్రధాని మోదీ, రష్యా ప్రధాని పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా ఆహ్వానించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్1 వరకు జరిగే ఈ సమిట్‌కు 20 దేశాలకు చెందిన నేతలకు అహ్వానం పలికారు. మోదీ, పుతిన్‌తో పాటు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల నేతలు హాజరు కానున్నారు.
ప్రధాని మోదీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు. చైనా అధ్యక్షుడు 2019లో భారత్‌కు వచ్చారు. ఆ మరుసటి ఏడాది లఢఖ్ సరిహద్దుల్లో భారత్–-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరుడు రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చివరిసారిగా భేటీ అయ్యారు. కాగా, ప్రపంచ దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న అమెరికాకు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు జిన్‌పింగ్ ఈ సదస్సును ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వేదికగా గ్లోబల్ సౌత్ దేశాలకు సంఘీభావంగా శక్తివంతమైన ప్రదర్శన ఉంటుందని అంచనా వేశాయి.
టెర్రరిజాన్ని ఖండించాలి
చైనాలో ఈ నెలాఖరునుంచి జరుగుతున్న ఎస్‌సీఓ సమిట్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని భారత్ ఆశిస్తున్నది. ఈ మేరకు ఎస్‌సీఓ సభ్య దేశాలు, భాగస్వామ్యులతో భారత్కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) తన్మయలాల్ తెలిపారు. ‘‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులను ఎదుర్కొనే ప్రాథమిక లక్ష్యంతో ఎస్‌సీఓను స్థాపించారు. ఇవి ఇప్పటికీ ఒక సవాలుగా కొనసాగుతున్నాయి” అని పేర్కొన్నారు.
2023లో భారత్ అధ్యక్షతన జరిగిన ఎస్‌సీఓ సమిట్‌లో టెర్రరిజాన్ని ఎదుర్కోవడంపై సంయుక్త ప్రకటన చేసినట్టు గుర్తు చేశారు. ఈ సమిట్‌లో అది తుదిరూపు దాలుస్తుందని ఆశిస్టున్నట్టు చెప్పారు. కాగా, ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని మోదీ.. జపాన్, చైనాలో 4 రోజులు పర్యటించనున్నారు.