చిన్న వర్షాలకే: యాదాద్రి ఘాట్​రోడ్డు కూలింది

చిన్న వర్షాలకే: యాదాద్రి  ఘాట్​రోడ్డు కూలింది

    పలుచోట్ల బీటలు వారిన రహదారి

    పనుల్లో కొరవడుతున్న నాణ్యత

యాదాద్రి పనుల్లో నాణ్యత లోపిస్తోంది. ఇటీవలి వర్షాలు పనుల్లో డొల్లతనాన్ని బయటపెట్టాయి. గుట్టపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ప్రధాన ఘాట్​రోడ్డు వర్షాలకు కూలిపోయింది. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర సర్కారు తీర్చిదిద్దుతోంది. ఆలయ అభివృద్ధి కోసం వైటీడీఏ(యాదాద్రి టెంపుల్​డెవలప్​మెంట్​అథారిటీ)ను 2014లోనే ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల కోసం రూ. 2000 కోట్లు కేటాయించారు.  ధార్మిక అవసరాలకు యాదగిరిగుట్ట, పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాల పరిధిలోని దాదాపు 80 సర్వే నెంబర్లలో 2028.37 ఎకరాలను సేకరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దగుట్టపైకి వెళ్లి రావడానికి వీలుగా మున్నూరు కాపు సత్రం పక్క నుంచి ప్రధాన ఘాట్​రోడ్డును నిర్మిస్తున్నారు.

గుట్టపైన 60 కి పైగా లింక్​ రోడ్లను ఏర్పాటు చేశారు. పెద్దగుట్టపై  వైటీడీఏ కార్యాలయంతో పాటు హెలీప్యాడ్​ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 16 కిలోమీటర్ల రోడ్డు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఘాట్​రోడ్డు ఇటీవలి వర్షాలకు కూలిపోయింది. గుట్టపైన జరగడం, ఇంకా రాకపోకలు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు కూలిపోయిన విషయం ఎవరికి తెలియలేదు. మరికొంత రోడ్డు కూడా  నెర్రెలు బారి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కూలిపోయిన రోడ్డు స్థానంలో మళ్లీ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. కానీ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రోడ్డును తొలగించకుండా.. దానికి అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్నారు.

చిన్న వర్షాలకే…

జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే కొద్ది శాతం అదనంగా కురిసింది. అదే యాదగిరిగుట్ట మండలానికి వస్తే సాధారణ వర్షపాతానికంటే తక్కువే కురిసింది. ఈ వర్షానికే ఘాట్​ రోడ్డు కూలిపోవడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.  వైటీడీఏ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్ల నిర్మాణంలో నాణత్య కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి