- ఏప్రిల్ 15లోపు క్యూ లైన్ నిర్మాణం పూర్తవ్వాలె
- 360 డిగ్రీలు తిరిగి చూసినా గుడి అద్భుతంగా కనబడాలె
- గుట్ట నిర్మాణ పనులపై సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూటికి నూరు శాతం రాతి కట్టడాలు, కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న ఈ గుడి అద్భుత రూపాన్ని సంతరించుకుంటోందన్నారు. పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రపంచ ఆలయాల్లో తన ప్రత్యేకత చాటుకోనుందని చెప్పారు. పునః ప్రారంభం తర్వాత లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, వారికి ఇబ్బంది లేకుండా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని సూచించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష చేశారు.
శివాలయ ప్రహరీకి త్రిశూలం ఆకారాలు
350 ఫీట్ల పొడవైన క్యూ లైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. క్యూ లైన్ పొడవునా ప్రాకారంపై అమర్చనున్న కలశపు నమూనాలను కేసీఆర్‌కు అధికారులు చూపించగా అందులో ఒకటి ఫైనల్ చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీని తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మించాలని సూచించారు. ఏప్రిల్ 15లోపు క్యూలైన్ నిర్మాణం పూర్తి కావాలన్నారు. దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో క్రియేటివ్‌గా తీర్చిదిద్ది పెడస్టల్‌కు కూడా ఇత్తడితో డిజైన్లను బిగించాలని చెప్పారు. శివాలయ నిర్మాణ ప్రహరీకి ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను అమర్చాలని సూచించారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా గుడి చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించేలా తుదిమెరుగులు దిద్దాలన్నారు.
అత్యంత సుందరం అద్దాల మండపం
బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం ఏర్పాటు చేసినట్టే శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమివ్వాలని కేసీఆర్ సూచించారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్‌తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణి కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీపై రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అలంకరించాలని చెప్పారు. 80 ఫీట్ల పొడవున్న దీప స్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమవుతోందని సీఎం చెప్పారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణం చుట్టూ పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం చూశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ పాల్గొన్నారు.
