జనవరి లోపు యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు పూర్తి కావాలి: నవీన్ మిట్టల్

జనవరి లోపు యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు పూర్తి కావాలి: నవీన్ మిట్టల్

మిర్యాలగూడ, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. జెన్ కో సీఎండీ ఎస్.హరీశ్, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన శుక్రవారం పవర్ ప్లాంటును సందర్శించారు. విద్యుత్​ఉత్పత్తి యూనిట్లను, పవర్ స్టేషన్‎కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్ల  స్విచ్ యార్డులను పరిశీలించారు. 

ఆ తర్వాత వనమహోత్సవంలో భాగంగా ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బీహెచ్ఎల్ఈఎల్, జెన్ కో, ఇంజనీరింగ్ అధికారులతో పవర్ ప్లాంట్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. వచ్చే జనవరి నుంచి విద్యుత్ డిమాండ్ ఉండనుందని, 5 యూనిట్లు కంప్లీట్ చేసి ఉత్పత్తి  ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్కువ ధరకు బొగ్గు ను తీసుకునే విధంగా అధికారులు మార్గాలు అన్వేషించాలని సూచించారు.  

ప్లాంటుకు వచ్చే మెయిన్, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని,  ఆర్అండ్ బీ నిర్మించే రోడ్డుకు భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని జెన్ కో  సీఎండీ ఎస్. హరీశ్​ఆదేశించారు. ప్లాంటు ప్రస్తుత పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా సీఈ రమేశ్​బాబు వివరించారు. రివ్యూ మీటింగ్ లో బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తేజేందర్ గుప్త, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్ ,థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సీఈ శ్రీనివాసరావు,బీ హెచ్ఈఎల్ సీఈ సురేశ్, ఈడీ వినోద్, జాకబ్ పాల్గొన్నారు. 

సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి  

భవిష్యత్ లో విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేలా, సోలార్ పవర్ ఉత్పత్తి పెంపునకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.  పవర్ హౌస్​లోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను పరిశీలించారు.

అనంతరం జెన్ కో పవర్ హౌస్ సమీక్ష చేసి మాట్లాడారు.  సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా  లక్ష్యం మేరకు ఉత్పత్తికి ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కేంద్రం సీఈ మంగేశ్ కుమార్  జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివరాలను తెలియజేశారు. ఆయన వెంట సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.