యాదగిరిగుట్టపై కొనసాగుతున్న పనులు

యాదగిరిగుట్టపై కొనసాగుతున్న పనులు

యాదగిరిగుట్ట: వేల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే గొప్పగా కట్టిన యాదాద్రి ఆలయంలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి.  ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగిపోగా... కాంప్లెక్స్, క్యూ లైన్లలోకి నీళ్ళు చేరాయి. నాసిరకం పనులతోనే రోడ్లు కుంగాయనీ... వందేళ్ళయినా నిర్మాణాలు చెక్కు చెదరవని సీఎం, మంత్రులు చెప్పిన మాటలు ఒట్టివేనని తేలిందని జనం మండిపడుతున్నారు. 


యాదగిరిగుట్టలో ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నారసింహుడి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు కుంగిపోయింది. కొండ పైకి రాకపోకలకు బ్రేక్ పడింది. కాలినడకనే భక్తులు కొండపైకి వెళ్ళారు. కొన్ని రోజుల క్రితమే వందల కోట్ల రూపాయలతో ఈ ఘాట్ రోడ్డు నిర్మించారు. వర్షం ధాటికి నాసికరం పనులు బయటపడ్డాయి. ఆలయ కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్లు కోతకు గురయ్యాయి.  ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ తో పాటు రింగ్ రోడ్ చెరువులాగా మారింది. కొండ పైకి ఎక్కే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో బస్సులు దిగబడ్డాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జేసీబీ సాయంతో బురదను ఎత్తివేశారు అధికారులు. కాంప్లెక్స్, క్యూలైన్లలోకి వర్షపు నీరు చేరింది. ఈదురు గాలులకు కొండపైన చలువ పందిళ్లు కుప్పకూలాయి. 

యాదాద్రిపై నాసిరకంగా నిర్మాణ పనులు చేయడంతోనే ఇలా రోడ్ కుంగిపోయిందని మండిపడుతున్నారు భక్తులు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా పనులు చేశారని ఆరోపిస్తున్నారు. యాదాద్రి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి దాదాపు 2 వేల కోట్లు ఖర్చుచేసినా....పనుల్లో నాణ్యత లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలోనే గొప్పగాయాదాద్రి ఆలయాన్ని కడుతున్నట్టు ప్రభుత్వం చెప్పింది. వందల కోట్ల రూపాయలతో పనులు జరగ్గా... వందేళ్లు పటిష్టంగా ఉండేలా నిర్మాణమనీ... యాదగిరిగుట్ట ఆలయ పునర్ నిర్మాణంపై సీఎం కేసీఆర్ తో  మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా మాటలు చెప్పారు. కానీ... ఒక్క వానకే యాదగిరిగుట్ట రోడ్లు కుంగిపోయాయి. కోట్ల రూపాయలతో చేసిన పనులు ఒక్క వానకే ఇలా కావడమేంటని మండిపడుతున్నారు భక్తులు. ఎండాకాలంలో కురిసిన మామూలు వర్షానికే యాదాద్రి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... వచ్చే వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో అని భక్తులు మండిపడుతున్నారు. నాసిరకం పనులు చేసిన  కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.