ఇవాళ్టి నుంచి భద్రాద్రి, యాదాద్రి దర్శనాలు

ఇవాళ్టి నుంచి భద్రాద్రి, యాదాద్రి దర్శనాలు

నెట్​వర్క్, వెలుగు: పాక్షిక సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. గ్రహణానికి ముందే భక్తుల దర్శనాలను రద్దు చేసి ఆలయాలకు తాళాలు వేశారు. గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను తెరిచారు.  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి  ఉదయం 8.50 గంటలకు  ద్వారబంధనం చేశారు. పాతగుట్ట ఆలయాన్ని కూడా బంద్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ జరుపుతారు. ఉదయం 10 గంటల నుంచి దర్శనాలు పునరుద్ధరించనున్నారు. సుప్రభాత సేవ, పూజ తర్వాత వేములవాడ రాజన్న ఆలయాన్ని  ఉదయం 5.03 గంటలకు అధికారులు మూసివేశారు. సాయంత్రం  6.35 గంటలకు పుణ్యహవచనం, సంప్రోక్షణ, ఆలయ శుద్ధి  నిర్వహించారు.

 రాత్రి 8 గంటల నుంచి  భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో  మంగళవారం ఉదయం 8.30కే  భక్తులకు స్వామి దర్శనాలను నిలిపివేశారు. స్వామికి పూజలు చేసి, బలిహరణం సమర్పించి  ఆలయం తలుపులు మూసివేశారు. సూర్యగ్రహణం వీడిన తర్వాత రాత్రి 7 గంటలకు తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి చేశారు. సంప్రోక్షణ అనంతరం  ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం నుంచి దర్శనాలు కల్పిస్తారు. ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని  ఉదయం 8 గంటలకు  మూసివేశారు. సాయంత్రం 6.30కు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ నిర్వహించి..  7.30 గంటలకు  తెరిచారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో  పంచామృత అభిషేకం, తమలపాకుల అర్చన నిర్వహించి  ఉదయం  9 గంటల వరకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అనంతరం  కవాట బంధనం చేశారు. 

కార్తీక పూజలకు గుట్ట రెడీ

యాదగిరిగుట్ట: కార్తీకమాసం పూజలకు యాదగిరిగుట్ట నరసింహుడి క్షేత్రం సిద్ధమైంది. బుధవారం నుంచి నవంబర్ 23 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొండ కింద17 కోట్లతో నిర్మించిన సత్యనారాయణ స్వామి వ్రత మండపం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. బుధవారం సాయంత్రం ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.