వచ్చే ఏడాది చివర్లో యాదాద్రి ప్రారంభం!

వచ్చే ఏడాది చివర్లో యాదాద్రి ప్రారంభం!

అన్ని పనులు పూర్తయ్యాకే ముహూర్తం ఖరారు
తొందరపాటుతో పనులు చేయొద్దన్న సీఎం
పనుల పూర్తికి మరో 10 నుంచి 12 నెలల టైమ్​

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది చివరలో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని, ఈ లోపు ప్రధాన ఆలయంతోపాటు ఇతర పనులన్నీ పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం ఉండదని స్పష్టం చేశాయి. పనులన్నీ పూర్తి కావడానికి 10 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘యాదాద్రి పనులను చూశాక సీఎం కేసీఆర్ ఆలయ ప్రారంభానికి తొందరపడొద్దని చెప్పారు. హడావుడిగా పనులు చెయొద్దని, అన్నీ సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యమైనా పర్లేదు కానీ మాట రావొద్దన్నారు. అందుకని అన్ని పనులు అయ్యాకనే ముహూర్తం ఉంటుంది. అది 2020 డిసెంబర్ లో ఉండొచ్చు’అని ఆయన తెలిపారు. ప్రధాన ఆలయం పనులు దాదాపుగా ముగింపు దశలో ఉన్నాయని, అవి పూర్తికాగానే మిగతా పనులపై దృష్టి పెడతామని చెప్పారు.

విమర్శలు వస్తాయనే..

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులకు 2015 మే 31న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆప్పటి నుంచి పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పనుల పురోగతి మేరకు నిధులను రిలీజ్ చేస్తోంది. ప్రధాన ఆలయం పనులు పూర్తవగానే ప్రారంభోత్సవం చేయాలని ముందుగా నిర్ణయించారు. ఫిబ్రవరిలో ముహూర్తం ఉంటుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 17న యాదాద్రి పనులను పరిశీలించిన సీఎం మనసు మార్చుకున్నారని సమాచారం. ‘ప్రధాన ఆలయం పనులు పూర్తయితే సరిపోదు. భక్తులకు వసతి ఏర్పాట్లు ఉండాలి. కల్యాణకట్ట నిర్మించాలి. రవాణా సదుపాయం ఉండాలి. చుట్టూ గ్రీనరీ ఉండాలి. ఆదరాబాదరాగా ప్రధాన ఆలయం పనులు చేసి, మిగతా పనులు చేయకపోతే విమర్శలు వస్తాయి’అని సీఎం అన్నట్టు తెలిసింది.