యాదగిరిగుట్ట ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు షురూ ! 480 మీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.32 కోట్లు

యాదగిరిగుట్ట ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు షురూ ! 480 మీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.32 కోట్లు
  • రెండేండ్ల తర్వాత మళ్లీ మొదలైన వర్క్స్..
  • నిధులు లేక 2023లో నిలిపేసిన కాంట్రాక్టర్
  • పనుల పూర్తికి ప్రస్తుత సర్కార్ మరోసారి టెండర్ 
  • రూ.4.20 కోట్లకు దక్కిచుకున్న బీఎంకే కంపెనీ
  • 480 మీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.32 కోట్లు
  • ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తామంటున్న ఆర్అండ్ బీ

యాదగిరిగుట్ట, వెలుగు: దర్శనానికి వచ్చే భక్తులు ఈజీగా వాహనాల్లో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి వెళ్లేందుకు చేపట్టిన ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు మళ్లీ షురూ అయ్యాయి. రెండేండ్ల కింద మధ్యలోనే నిలిచిపోయిన 64 మీటర్ల ‘నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్’ ను ఆర్అండ్ బీ తిరిగి చేపట్టింది. యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తిరుపతి టెంపుల్ మాదిరిగా భక్తుల వాహనాలు కొండపైకి వెళ్లడానికి, కిందికి రావడానికి బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. గుట్ట ఎగ్జిట్ ఘాట్ రోడ్డు పనులు కంప్లీట్ చేయగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు 80 శాతం పూర్తయిన తర్వాత నిధుల కొరత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.  ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ టెండర్ నిర్వహించి వేరే కంపెనీకి  పనులు కేటాయించింది. ఐదు నెలల్లోపు బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఆర్అండ్ బీ చర్యలు తీసుకుంటోంది.  

కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కంపెనీకి..
కొండ మీదికి వెళ్లడానికి 2021లో రూ.32 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ‘C5’ కాంట్రాక్ట్ సంస్థ.. కొండకు దక్షిణం వైపున ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం నుంచి పాత ఘాట్ రోడ్డులోని జీయర్ కుటీర్ వద్ద రోడ్డుకు అనుసంధానించేలా 480 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో పనులు చేపట్టిం ది. ఫ్లై ఓవర్ లో 64 మీటర్ల పొడవుతో కేబుల్ బ్రిడ్జ్(నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్) ఏర్పాటు చేయాల్సి ఉంది.  ఫ్లై ఓవర్ పనుల్లో దాదాపు 80 శాతం కంప్లీట్ కాగా.. కేబుల్ బ్రిడ్జ్ పనులు మాత్రమే మిగిలాయి. నిధులు కొరత, బిల్లుల పెండింగ్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 2023లో మధ్యలోనే నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత పనులను పూర్తి చేయాలని ఆదేశించినా సంబంధిత కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. దీంతో కాంట్రాక్ట్ ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. బీకేఎమ్ కంపెనీ రూ.4.20 కోట్లకు దక్కించుకుని, పెండింగ్ పనులు షూరు చేసింది. 

కేబుల్స్ బిగించే పనులు స్పీడ్గా..
వారం రోజుల కింద బీకేఎమ్ కంపెనీ బ్రిడ్జ్ పనులను మొదలుపెట్టింది. ఏడాదిన్నర కింద లండన్ నుంచి తెప్పించిన కేబుల్స్ ను బిగించే స్టీరింగ్ వర్క్స్ స్పీడ్ గా చేస్తోంది. కేబుల్స్ బిగించడం పనులు పూర్తి కాగానే భారీ క్రేన్లతో ఫ్లై ఓవర్ కు అనుసంధానిస్తారు. ఆ తర్వాత 480 మీటర్ల  ఫ్లై ఓవర్ పై బీటీ రోడ్డు వేస్తారు. ఈ పనులన్నీ కంప్లీట్ కావడానికి నాలుగు నెలలకుపై గా సమ యం పడుతుందని ఆర్అండ్ బీ అధికా రులు చెబుతున్నారు. సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తెస్తామని ఆర్అండ్ బీ డీఈ శ్రీనివాస్ చెప్పారు.