యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం ఉదయం స్వామివారు ‘వటపత్రశాయి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం హంసవాహనంపై ప్రధానాలయ మాడవీధుల్లో విహరించారు. ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారిని మర్రి ఆకుపై సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగించారు.
ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల అర్చకత్వంలో వేదపండితులు, వేదపారాయణీకుల బృందం వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక వేదికపై స్వామివారిని అధిష్ఠించి వటపత్రశాయి అవతార విశిష్టతను భక్తులకు వివరించారు. మహాప్రళయ సమయంలో సమస్త లోకాలను తనలోనే దాచుకుని మర్రి ఆకుపై శయనించిన శ్రీమహావిష్ణువు లీలలను గుర్తు చేశారు.
రాత్రి 7 గంటలకు హంసవాహనంపై స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, టెంపుల్ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీకృష్ణ అలంకారం(మురళీకృష్ణుడు), పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు.
