యాదగిరిగుట్టలో మూడో రోజు కొనసాగిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్టలో  మూడో రోజు కొనసాగిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం, నమ్మాళ్వార్ పరమపద ఉత్సవాలను ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యుల అర్చకత్వంలో వైభవోపేతంగా నిర్వహించారు. 

ప్రత్యేక అలంకరణలో యాదగిరీశుడిని ఆలయ తిరువీధుల్లో విహరింపజేసి 'పురప్పాట్టు' సేవను నిర్వహించారు. ఈ నెల 24న మొదలైన అధ్యయనోత్సవాలు మంగళవారం ముగియనున్నాయి. మంగళవారం ఉదయం నిర్వహించే నూత్తందాది శాత్తుమొరై వంటి ప్రత్యేక పూజలతో అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు. ఈ నెల 28 నుండి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం  చుట్టనున్నారు.