
యాదగిరిగుట్ట, వెలుగు : నారసింహుడి జయంతి ఉత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు అవుతోంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 9న ఉదయం 8.45 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంకుమార్చన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనంతో జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి అలంకార సేవలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టతో పాటు పాతగుట్ట, దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి ఆలయంలో కూడా ఒకేసారి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 11న పూర్ణాహుతి, నరసింహుడి జయంతి, నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
జయంతి ఉత్సవాలు జరిగే మూడు రోజులు ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.