యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం..ఫిబ్రవరి 19న  ధ్వజారోహణం, దేవతాహ్వానం

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం..ఫిబ్రవరి 19న  ధ్వజారోహణం, దేవతాహ్వానం
  •     స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు విశ్వక్సేనపూజ, స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో ఉత్సవాలను ప్రారంభించారు.

పుణ్యాహవచనంలో భాగంగా పవిత్రజలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి లక్ష్మీసమేత నారసింహుడికి రక్షాబంధనం చేశారు. అలాగే గర్భగుడిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామికి కంకణధారణ అనంతరం ముఖ మంటపంలో అధిష్టింపజేసిన ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం అంకురారోపణం, మృత్సంగ్రహణం నిర్వహించారు. వేదపండితుల మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల మధ్య అర్చకులు అంకురారోపణ ఉత్సవాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. బుధవారం జరిగిన ప్రత్యేక పూజల్లో కలెక్టర్‌‌ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌‌రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్‌‌ నర్సింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో భాస్కర్‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, ఉపప్రధానార్చకులు మాధవాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మణాచార్యులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 19న ధ్వజారోహణం 

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. ధ్వజారోహణంలో భాగంగా లక్ష్మీనరసింహుల కల్యాణానికి గరుత్మంతుడి ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం భేరీపూజతో దేవతలకు ఆహ్వానం పలకనున్నారు.

గుట్టకు చేరిన అఖండజ్యోతి 

శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 15న హైదరాబాద్‌‌ బర్కత్‌‌పురలోని యాదగిరి భవన్‌‌ నుంచి బయలుదేరిన అఖండజ్యోతి బుధవారం రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంది. గుట్టకు చేరుకున్న యాత్రకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్‌‌పర్సన్‌‌ ఐనాల చైతన్యా మహేందర్‌‌రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌‌పర్సన్‌‌ గుండ్లపల్లి వాణీభరత్‌‌గౌడ్‌‌ మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.

స్థానిక భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు ఆటలు ఆడుతూ సంబరాలు జరిపారు. వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను రాయగిరి చెరువులో నిమజ్జనం చేశారు.