22  ఎమ్మెల్యే సీట్లు ఇయ్యాలె.. యాదవుల డిమాండ్ 

22  ఎమ్మెల్యే సీట్లు ఇయ్యాలె.. యాదవుల డిమాండ్ 
  • 7 ఎమ్మెల్సీ, 3 లోక్ సభ, 2 రాజ్యసభ సీట్లు కేటాయించాలె
  • యాదవ కార్పొరేషన్, యాదవ బంధు పెట్టాలని డిక్లరేషన్
  • యాదవులు ప్రధాని కావాలె: ప్రొఫెసర్ సూరజ్ మండల్ 
  • త్వరలో 25 లక్షల మందితో సభ పెడ్తం: తలసాని 
  • బీసీలే బీఫామ్ ఇచ్చే పరిస్థితి రావాలె: ఈటల

ఎల్ బీనగర్, వెలుగు: అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని యాదవ సంఘాల నేతలు కోరారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న యాదవులకు, 22 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ, యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ లో ‘యాదవ యుద్ధభేరి’ సభ జరిగింది. దీనికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, యాదవ సంఘాల లీడర్లు, జిల్లాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా యాదవ డిక్లరేషన్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న యాదవులకు జనాభా ప్రాతిపదికన 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 3 లోక్ సభ, 2 రాజ్యసభ సీట్లు ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీపీ మండల్ మనవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం యాదవులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలో ఎక్కువ జనాభా ఉన్న ఏకైక కులం యాదవులదే. 20 శాతం జనాభా ఉన్న యాదవ వర్గం నుంచే ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో యాదవుల జనాభా 18 శాతం ఉన్నప్పటికీ, రాజకీయంగా ప్రాతినిధ్యం మాత్రం నామమాత్రంగా ఉంది” అని ఆందోళన 
వ్యక్తం చేశారు. 

యాదవుల సంక్షేమానికి కృషి: తలసాని

యాదవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదుగురికి ఎమ్మెల్యేగా, ఒకరికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల్లోనూ అనేక మంది యాదవులకు అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. కోకాపేటలో రూ.400 కోట్ల విలువైన ఐదెకరాల స్థలం కేటాయించి, యాదవ భవన్ నిర్మించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులు భాగస్వాములు అయ్యారన్నారు. యాదవులలో ఐక్యత కోసం శ్రీకృష్ణ జన్మాష్టమి, సదర్ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్​లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి యాదవుల సత్తా చూపెడతామన్నారు.  

బీజేపీలో బీసీలకు ప్రాధాన్యం: ఈటల  

బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల కేటాయింపులో గొల్లకురుమలతో పాటు బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. ‘‘రాజకీయ పార్టీలు ఇచ్చే బీఫామ్ కోసం బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించింది. బీసీలే బీఫామ్ ఇచ్చే పరిస్థితి రావాలి. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి మారాలి” అని అన్నారు. కురుమలు, ముదిరాజ్, ఎంబీసీలకు అధికార పార్టీ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని 
మండిపడ్డారు. 

అనేక అవకాశాలు: లింగయ్య యాదవ్ 

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా, సామాజికంగా యాదవుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిందని చెప్పారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు విడిపోయి ఉన్నారని, ‘బలగం’  సినిమాలో మాదిరిగా అందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. కేవలం టికెట్లు సాధించుకోవడం కాదని, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అంబర్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను యాదవ సంఘ నేత ఆర్.లక్ష్మణ్ యాదవ్ కు ఇస్తామని ప్రకటించారు. అందరూ ఐక్యంగా ఉండి, ఆయనను గెలిపించాలని కోరారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, యాదవ సంఘాల నాయకులు చింతల రవీంద్రనాథ్, ఆర్.లక్ష్మణ్, బాలరాజ్, మురళీ, చిన్న శ్రీశైలం, జాజయ్య పాల్గొన్నారు. 

ఇదీ యాదవ డిక్లరేషన్.. 

యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 18% నిధులు కేటాయించాలి. కులాల వారీగా జనాభాను లెక్కించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. యాదవులకు ఎస్ఎన్టీ రిజర్వేషన్లు కల్పించాలి. యాదవులకు విద్య, ఉద్యోగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. యాదవ బంధు ప్రకటించి, రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. బీపీ మండల్ సిఫార్సులను అమలు చేయాలి. యాదవ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇవ్వాలి. పెద్దగట్టు లింగమంతుల గుడికి రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలి. ఇక్కడ జరిగే జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని గొల్లకురుమలకే గొర్లు ఇచ్చారు. పట్టణాల్లో ఉన్నోళ్లకు బర్లు, ఆవులు ఇవ్వాలి.