ఆలేరు (యాదాద్రి), వెలుగు : కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో సోమవారం జరిగింది. సీఐ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం... ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన వంగాల రాములమ్మ ఆదివారం చనిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, చెన్నైలో ఉంటున్న రాసుకుచ్చల లక్ష్మి (80), మల్లిక (50)తో పాటు మరో ఏడుగురు ట్రైన్‌లో కాజీపేటకు వచ్చారు. అక్కడి నుంచి కారులో తూర్పుగూడెం బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు శివారులోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో మల్లిక స్పాట్‌లోనే చనిపోగా లక్ష్మితో పాటు మిగతా వారు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారి హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో లక్ష్మి చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
