
ఉత్తరాది రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. పంజాబ్ లో భారీ వర్షాలకు వరదల సంభవించి ఇప్పటివరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్ లో దాదాపు 1,655 గ్రామాలు ప్రభావితమయ్యాయి. గురుదాస్‌పూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. 324 గ్రామాలు వరదల బారిన పడ్డాయి.తరువాత ఫిరోజ్‌పూర్ (111), అమృత్సర్ (190), హోషియార్‌పూర్ (121), కపుర్తలా (123) సంగ్రూర్ (107) గ్రామాలు వరదల వల్ల నష్టపోయాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూఢిల్లీలోని నిగం బోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర యమునా వరద నీటితో మోకాల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జిదగ్గర కూడాయమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది..గురువారం(సెప్టెంబర్4) ఉదయం యమునా నది నీటిమట్టం 207.48 మీటర్లు ఉంది.
గత రెండు రోజులుగా కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో కాశ్మీర్‌లోని విద్యాసంస్థలు రెండో రోజు కూడా మూసివేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి, ఇతర రహదారులు ట్రాఫిక్ ను మూసివేశారు. గురువారం పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇటీవల వర్షాలతో సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అంతర్ నియంత్రిత బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
గురువారం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. వరద నీటిలో భారీ సంఖ్యలో దుంగలు ప్రవహిస్తున్నట్లు మీడియా దృశ్యాలు వైరల్ కావడంతో దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. హిమాలయ అడవులను అక్రమంగా నరికివేస్తున్నారు. దీనివల్ల పదే పదే ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవిస్తుంది. మరణాలు సంభవిస్తున్నాయని కోర్టు హైలైట్ చేసింది.