యానాంలో ఓఎన్జీసీ పైప్ లీక్... భయం గుప్పిట్లో సమీప గ్రామాల ప్రజలు

యానాంలో  ఓఎన్జీసీ పైప్ లీక్... భయం గుప్పిట్లో సమీప గ్రామాల ప్రజలు

యానాంలో గ్యాస్‌ లీక్ కలకలం రేపింది. సముద్రం నుండి ఐలాండ్ నెంబర్3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల  పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విపరీతమైన గ్యాస్‌ వాసన చుట్టుముట్టింది. గ్యాస్ లీక్ కావడంతో  స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు   భయబ్రాంతులకు గురయ్యారు.  పలుమార్లు ఇలాంటి గ్యాస్ లీక్  ఘటనలు జరుగుతున్నా  చమురు సంస్థలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


యానాం  పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిన పడ్డాయి.  ఈ ఘటనను గమనించిన స్థానికులు    సముద్రంలోనే పైప్లైన్ నుండి వచ్చే గ్యాస్ ను  ఆఫ్ చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.  

గ్యాస్​ లీక్​ గురించి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ  ప్రత్యేక ప్రతినిథి మల్లాడి కృష్ణారావుకు సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్పకు చెందిన నాయకులు ఫోన్​ ద్వారా సమాచారం అందించారు.   విషయం తెలుసుకున్న అధికారి  చమురు సంస్థలకు చెందిన ఉన్నత సేప్డీ అధికారులతో ఫోన్​ లో గ్యాస్​ లీక్​ గురించి ఆరా తీశారు. 

యానాంలో గ్యాస్​ పైప్​ లీకేజ్​ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు అంబేద్కర్​ కోనసీమ జిల్లా కలెక్టర్​...  ఇతర అధికారులతో చర్చించారు.  గ్యాస్​ లీక్​ అయిన గంటన్నర  సమయంలోనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో   ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని కలెక్టర్​ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఓఎన్​జీసీ పైప్​ లైన్​ మొత్తం  చెక్​చేయించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ  చేశారు.  సమీప గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తనకు తెలియపర్చాలని సీఎం అధికారులను సూచించారు.