ఈ యాసంగి సగం పంటనే

ఈ యాసంగి సగం పంటనే
  • నిరుడు పండిన వడ్లు 1.22 కోట్ల టన్నులు
  • ఈసారి పండేది 58.92 లక్షల టన్నులే
  • సగానికి పడిపోనున్న దిగుబడి
  • సాగు తగ్గడం వల్లే ప్రభావం

హైదరాబాద్, వెలుగు: ఈసారి యాసంగి దిగుబడి సగానికి సగం పడిపోనుంది. రాష్ట్రంలో నిరుడు కంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవడంతో ఆ ప్రభావం దిగుబడులపై భారీగా పడనుంది. నిరుడు ఇదే టైమ్‌‌కు యాసంగి పంటలన్నీ కలిపి 58.16 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి ఇప్పటి వరకు 39.24 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. నిరుడుతో  పోలిస్తే యాసంగి పంటల సాగు దాదాపు 19 లక్షల ఎకరాలు తగ్గింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ సాగు లెక్కలను ప్రభుత్వానికి అందజేయగా.. వాటిని బట్టే స్టాటిస్టిక్స్ ​డిపార్ట్​మెంట్​పంట దిగుబడులపై అడ్వాన్స్​ఎస్టిమేషన్​ రిపోర్ట్​సిద్ధం చేస్తోంది. నిరుడు యాసంగిలో 52.22 లక్షల ఎకరాల్లో వరి పెట్టడం ద్వారా.. 1.22 కోట్ల టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది. కాగా ఈ యేడు యాసంగిలో ఇప్పటి వరకు కేవలం 25.21లక్షల ఎకరాల్లోనే వరి నాట్లు పడ్డాయి. ఎకరానికి 2.33 టన్నుల చొప్పున దిగుబడి అంచనా వేసుకుంటే మొత్తం 58.92 లక్షల టన్నులకే పరిమితం కానుంది. 

ప్రత్యామ్నాయం ఉత్తముచ్చటే....
 ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పినా.. ఎక్కడా పెద్దగా సాగులోకి రాలేదు.11 రకాల ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు, శనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెప్పింది. కానీ అవసరమైన విత్తనాలు అందుబాటులో లేక రైతులెవరూ ప్రత్యామ్నాయం వైపు వెళ్లలేదు. వరి సాగు సగానికి తగ్గినా ఇతర పంటల సాగు మాత్రం ఉత్తముచ్చటే అయింది. ప్రత్యామ్నాయ పంటలు వేయలేక కొందరు రైతులు భూములు పడావు పెట్టగా మరికొందరు నాట్లు వేశారు. నిరుడు కంటే ఈసారి మక్క, జొన్న, శనగ సాగు తగ్గడంతో దిగుబడులు కూడా తగ్గుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పప్పుశనగ నిరుడు 3.53 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే, ఈసారి పదివేల ఎకరాలు తగ్గి 3.43 లక్షల ఎకరాలకే పరిమితమైంది. పల్లి నిరుడు 2.79 లక్షల ఎకరాల్లో వేస్తే ఈసారి 3.28 లక్షల ఎకరాలకు చేరుకుంది. పప్పుశనగ, వేరుశనగ రెండు కలిపి10 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నా పెరగలేదు. దీంతో వీటి దిగుబడులు కూడా తగ్గే పరిస్థితి నెలకొంది. జొన్న నిరుడు1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే, ఈయేడు 87,578 ఎకరాల్లోనే  వేశారు.