యాసంగి సాగు ఆల్‌టైం రికార్డ్‌

యాసంగి సాగు ఆల్‌టైం రికార్డ్‌

హైదరాబాద్‌, వెలుగు :  ఈ ఏడాది యాసంగి సాగు భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2020-–21లో ఉన్న 68.17 లక్షల ఎకరాల సాగు రికార్డును రైతులు బ్రేక్ చేశారు. వరినాట్లలోనూ 53.08లక్షల ఎకరాలతో ఆల్‌టైం రికార్డు నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో యాసంగి పంటలు ఎక్కువగా సాగయ్యాయి. వరితో పాటు మొక్కజొన్న, పప్పుశనగ, వేరుశనగ పంటలు ఎక్కువ వేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ యాసంగి సాగుపై నివేదిక అందించింది.

భూగర్భ జలాలు పెరిగినయ్

రాష్ట్ర వ్యాప్తంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇప్పటి వరకు 2020–21లో వేసిన 52.80 లక్షల ఎకరాలే ఎక్కువ. భూగర్భజలాలు పెరిగి చెరువులు, బావుల్లో నీరు ఉండటంతో వరి సాగు పెరిగింది. 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వడ్లు కొనమని నిరుడు సర్కార్​ ప్రకటించడంతో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది ఆంక్షలు లేకపోవడంతో రైతులందరూ వరి సాగుకే మొగ్గు చూపడంతో రికార్డు స్థాయిలో సాగైంది. త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వకపోవడంతో వరి సాగు తగ్గిందని, లేకపోతే 60లక్షల ఎకరాలు దాటేదని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.

వరి తర్వాత ఎక్కువగా మక్క సాగు

వరి తర్వాత మక్కలు ఎక్కువగా సాగవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.24లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. 4.63 లక్షల ఎకరాలని అధికారులు అంచనా వేయగా.. లక్షన్నర ఎకరాల సాగు పెరిగింది. ఖమ్మం, నిర్మల్‌, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, కామారెడ్డి, గద్వాల, జగిత్యాల, నిజామాబాద్‌, కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మక్కలు ఎక్కువగా సాగయ్యాయి. మక్క తర్వాత పప్పుశనగ, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు.

నల్గొండలో 5.64 లక్షల ఎకరాల్లో సాగు

యాసంగి సాగులో అన్ని పంటల్లో 5.64 లక్షల ఎకరాలతో నల్గొండ టాప్​లో నిలిచింది. తర్వాత నిజామాబాద్‌లో 4.87 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 4.76లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 4.12లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 3.58లక్షల ఎకరాలు, జగిత్యాలలో 3.31లక్షల ఎకరాలు, కరీంనగర్‌లో 2.91 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 2.86 లక్షల ఎకరాలు, ఖమ్మంలో 2.94 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 2.84 లక్షల ఎకరాలు, నిర్మల్‌లో 2.70లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

వరి సాగులోనూ..

వరి నాట్లు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో సాగైంది. తర్వాత సూర్యాపేటలో 4.73లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 3.93లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 3.29లక్షల ఎకరాలు, జగిత్యాలలో 2.93 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 2.85 లక్షల ఎకరాలు, కరీంనగర్ లో 2.70లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 2.61 లక్షల ఎకరాలు, మెదక్​లో 2.17 లక్షల ఎకరాలు సాగు చేశారు.

వరి కొనుగోళ్లపై డైలమాలో సివిల్ సప్లయ్స్

రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో వడ్లు ఎలా కొనాలన్న దానిపై సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ డైలమాలో పడింది. ఇప్పటికే నిరుడు యాసంగిలో కొన్న వడ్లకు నూక శాతం ఎక్కువొస్తే మిల్లులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి కొనిపించింది. ఇప్పటిదాకా సీఎంఆర్‌ ఇవ్వలేదు. దీనికితోడు నూక శాతం తేల్చలేదు. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో అని సివిల్​ సప్లయ్స్ అధికారులు పరేషాన్ అవుతున్నరు. ఈనెలాఖరుకు ఢిల్లీకి వెళ్లి సీఎంఆర్‌పై చర్చించడానికి సిద్ధమవుతున్నరు.