ముందుకు సాగని యాసంగి పనులు.. సీఎం వద్దన్నా మక్కలు వేస్తున్నరు

ముందుకు సాగని యాసంగి పనులు.. సీఎం వద్దన్నా మక్కలు వేస్తున్నరు

ఇప్పటిదాకా 6.67 లక్షల ఎకరాల్లోనే పంటలు

వరినాట్లు 59వేల ఎకరాల్లోనే..

హైదరాబాద్, వెలుగు: ఈ యేడు యాసంగి సాగు అనుకున్నంత ముందుకు సాగుతలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్​లో సాధారణ సాగు 36.93 లక్షల ఎకరాలు కాగా.. ఈ సారి ఇప్పటివరకు 6.67 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలు వేసినట్లు సర్కార్ కు వ్యవసాయశాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఈ టైమ్ వరకూ కనీసం 9.47 లక్షల ఎకరాలు దాటాల్సి ఉంది. కానీ మూడు లక్షల ఎకరాలు తక్కువే సాగు చేశారు. నిరుడు ఈ టైమ్​తో పోల్చుకుంటే కూడా లక్ష ఎకరాలకు పైగా సాగు తక్కువైంది.

వరినాట్లు తక్కువ పడ్డయ్

ఇప్పటికే వరి నాట్లు ప్రారంభించాల్సి ఉండగా రైతులు ఇంకా వడ్లు అమ్ముకునే దశలోనే ఉన్నారు. కొన్ని జిల్లాల్లో సన్న రకం వరి పంటలు చివరి దశలో ఉన్నాయి. యాసంగిలో వరి సాధారణ సాగు 22.19 లక్షల ఎకరాలు. ఏటా ఈ టైమ్‌‌కు78 వేల ఎకరాలకు పైగా వరి నాట్లు పడేవి. కానీ ఈసారి ఇప్పటివరకు 59 వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. జొన్నల సాగు టార్గెట్ లక్ష ఎకరాలు కాగా ఇప్పటి వరకు19 వేల ఎకరాల్లో వేశారు.

మక్కలు వేసిన్రు

సాధారణంగా యాసంగిలో మక్కలు 4 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. యాసంగిలో మక్కలు వేయొద్దని సీఎం కేసీఆర్​ చెప్పినప్పటికీ ఇప్పటివరకు 65 వేల ఎకరాల్లో వేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు. అనధికారిక లెక్కల ప్రకారం లక్ష ఎకరాలు దాటింది.

2.60 లక్షల ఎకరాల్లో శెనగ

శెనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు కాగా, షరతుల సాగులో భాగంగా 4.50 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 2.60 లక్షల ఎకరాల్లో శెనగ సాగు మొదలైంది. పల్లి 1.75 లక్షల ఎకరాలు, నువ్వులు776 ఎకరాలు, పొద్దు తిరుగుడు 6,380 ఎకరాలు,  ఆయిల్‌‌ సీడ్స్‌‌ 6,146  ఎకరాల్లో సాగు చేస్తున్నారు.