IND vs SA: విశాఖలో జైశ్వాల్ సూపర్ సెంచరీ.. నాలుగో వన్డేలోనే శతకం బాదేశాడు!

IND vs SA: విశాఖలో జైశ్వాల్ సూపర్ సెంచరీ.. నాలుగో వన్డేలోనే శతకం బాదేశాడు!

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రెండు వన్డేల్లో  విఫలమై విమర్శల పాలైన ఈ యువ క్రికెటర్ మూడో వన్డేలో అదరగొట్టాడు.  శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్ రెండో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. ఆడుతున్న నాలుగు వన్డేలోనే జైశ్వాల్ సెంచరీతో ఆకట్టుకున్న ఈ ముంబై క్రికెటర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 

తొలి రెండు వన్డేల్లో తక్కువ స్కోర్ కే ఔటైనా మూడో వన్డేలో జైశ్వాల్ కు తుది జట్టులో అవకాశమిచ్చారు. వచ్చిన అవకాశాన్ని జైశ్వాల్ చక్కగా వినియోగించుకున్నాడు. దూకుడుగా కాకుండా ఆచితూచి తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఎలాంటి చెత్త షాట్స్ ఆడకుండా తన ఇన్నింగ్స్ ను చిన్నగా ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్ లో రోహిత్ బ్యాట్ ఝులిపించడంతో జైశ్వాల్ పై ఒత్తిడి తగ్గింది. హాఫ్ సెంచరీ మార్క్ అందుకోవడానికి 75 బంతులు తీసుకున్న ఈ ముంబై క్రికెటర్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. 50 నుంచి 1000 పరుగులు చేయడానికి 36 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. 

జైశ్వాల్ సెంచరీతో పాటు రోహిత్ శర్మ 75 పరుగులు చేయడంతో మూడో వన్డేలో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 35 ఓవరాళ్లతో వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో జైశ్వాల్ (100)తో పాటు విరాట్ కోహ్లీ (33) ఉన్నాడు. టీమిండియా విజయానికి 16 ఓవర్లలో 50 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇండియా విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా క్వింటన్ డి కాక్ (106) సెంచరీతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.