న్యూఢిల్లీ: ఇండియా క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మకు.. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. గతేడాది షెడ్యూల్ చేసిన డోపింగ్ పరీక్షలకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండలేదు. తమ గైర్హాజరుకు సరైన కారణాలు కూడా చెప్పకపోవడంతో నాడా చర్యలు తీసుకుంది. నాడాకు చెందిన రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) జాబితాలో ఉన్న ప్లేయర్లు తమ ముందస్తు వివరాలను (నివాసం, శిక్షణ స్థలం) నాడాకు తెలియజేయాల్సి ఉంటుంది.
పరీక్షల కోసం అధికారులు వచ్చినప్పుడు ప్లేయర్లు అందుబాటులో లేకపోతే దాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అయితే యశస్వి, షెఫాలీకి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో నోటీసుతో సరిపెట్టారు. క్రికెటర్లకు ఇచ్చిన నోటీసు అంశాన్ని బీసీసీఐ, ఐసీసీకి కూడా నాడా తెలియజేసింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో డోపింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉందని బీసీసీఐ ప్రతినిధి అన్నారు. ప్రస్తుత త్రైమాసికానికి గానూ మొత్తం 13 మంది క్రికెటర్లు అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కె.ఎల్. రాహుల్, దీప్తి శర్మ, రేణుక సింగ్ ఠాకూర్ నాడా ఆర్‌టీపీ జాబితాలో ఉన్నారు.
