వందేభారత్ రైలు కు యమ క్రేజ్! 16 కోచ్ లతో యశ్వంత్ పూర్ కు చైర్ కార్ రైలు..

వందేభారత్ రైలు కు యమ క్రేజ్! 16 కోచ్ లతో యశ్వంత్ పూర్ కు చైర్ కార్ రైలు..
  • యశ్వంత్​పూర్​కు ఈ నెల10 నుంచి 16 కోచ్​లతో నడపాలని నిర్ణయం
  • ఇప్పటికే సికింద్రాబాద్​నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్​ సర్వీసు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​రైలు వందేభారత్​లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాచిగూడ–యశ్వంత్​పూర్​మధ్య 8 కోచ్​లతో నడిచే వందే భారత్​ను ఈ నెల 10 నుంచి 16 కోచ్​లతో నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ట్రైన్​నంబర్​20703 చైర్​కార్​–07తో నడిచే ఈ రైలును చైర్​కార్​–16గా మార్చనున్నారు. అలాగే ట్రైన్​నంబర్​20704లో ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్​ క్లాస్​–01 నుంచి ఎగ్జిక్యూటివ్​ క్లాస్​–2గా మార్పు చేశారు. 

కాచిగూడ–యశ్వంత్​పూర్​–కాచిగూడ వందేభారత్​ఎక్స్​ప్రెస్​ను ముందుగా 8 ఎనిమిది కోచ్​లతో ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే ఈ రైలులో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మరో 8 కోచ్​లను పెంచాలని నిర్ణయించారు. దీనిపై రైల్వే జీఎం సందీప్​మాధుర్​మాట్లాడుతూ వందేభారత్​ కోచ్​లను పెంచడం వల్ల ఐటీ సిటీస్​గా అభివృద్ధి చెందిన బెంగళూరు, హైదరాబాద్​ మధ్య ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. 

ఇవే కాకుండా ప్రస్తుతం సికింద్రాబాద్​–నాగ్​పూర్, విశాఖపట్నం– సికింద్రాబాద్​, సికింద్రాబాద్​–విశాఖపట్నం మధ్య రెండు వందేభారత్​ రైళ్లను నడుపుతున్నారు. ఇందులో నాగ్​పూర్​ 8 కోచ్​లు, విశాఖపట్నం, సికింద్రాబాద్​ల మధ్యనడిచే వందేభారత్​20 కోచ్​లతో నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే సికింద్రాబాద్​, తిరుపతి మధ్య నడిచే వందేభారత్​ 16కోచ్​లతో నడుపుతున్నారు.