Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ..జగన్ జైత్ర యాత్ర ప్రభంజనం

Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ..జగన్ జైత్ర యాత్ర ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ, పేద‌ల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో యాత్ర 2 (Yatra 2) మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి వి రాఘవ్ (Mahi V Raghav). ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 8న) థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల వైఎస్సార్ అభిమానులు, సినిమా లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూసారు. భారీ అంచనాల మధ్య వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 మూవీ బెస్ట్‌ బయోపిక్‌ అని చెప్పొచ్చు .వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (మమ్ముట్టి) మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి (జీవా) చేసిన ఓదార్పు యాత్రను కళ్ళకి కట్టినట్లుగా చూపించారు. ఓదార్పు యాత్ర సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు..పేదలు పడే బాధలు..సమాజంలో జరిగే అన్యాయాలు..ఆయనని ప్రేరేపించిన సంఘటనలు నుంచి..ఏ విధంగా పాదయాత్ర మొదలు పెట్టాడనేది ఆసక్తికరంగా చూపించారు. ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని..అణిచివేయబడిన జీవితాలను తానే స్వయంగా తెలుసుకున్న భావోద్వేగాల సమాహారమే..డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర  కథ.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు..మారిన వ్యవస్థల పనితీరును కనబడుతుంది. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలను..కన్నా కలలను నెరవేర్చడం కోసం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు..అందుకు సంబంధించిన పార్టీలు చేసిన కుట్రలు..వాటన్నింటిని అన్ని విధాలుగా ఎదుర్కొన్ని..వైఎస్‌ జగన్‌ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని..ఎలా ప్రజా నాయ‌కుడిగా ఎదిగారనేదే యాత్ర మూవీ కథ. యాత్ర 2 కథ విషయానికి వస్తే..‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్‌ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 

ఎలా ఉందంటే..

యాత్ర 2 మూవీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ కథ కాదు..వారి వ్యక్తిత్వానికి, వ్యవస్థకి మధ్య జరిగిన కథ. ఈ కథ ప్రజల కష్టాలు..బాధలు, సామాన్య ప్రజలకి కావాల్సిన అవసరాలు తెలిపేది. 

ముఖ్యంగా పేదల ప్రజల కోసం అందించాల్సిన విద్య, వైద్యం, నీరు ఇలా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన వ్యవస్థ కోసం పాటు పడే ఇద్దరు వ్యక్తుల కథ. అలాంటి వారు పేదల జీవితాలలోకి రావడానికి చేసిన పాదయాత్ర, ఓదార్పు యాత్ర వంటి మహా కార్యక్రమంలో చూసిన విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. 

వైఎస్సార్‌ రాజకీయం ఆయనను ఎంతోగాను నమ్ముకున్న ప్రజల కోసం చివరి వరకు ఏం చేశారు? వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇచ్చాడు? ఎలాంటి పథకాలు తీసుకొచ్చాడు అనేది యాత్రలో చూపించిన మహి వి రాఘవ్‌..? ఇప్పుడు యాత్ర2లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి వైఎస్సార్‌ ఆశయాలను..ఆయనకు ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం..చేపట్టిన యాత్రలు, ఆయన పడిన కష్టాలు? రాష్ట్ర, దేశ అదిష్టానం వద్దని చెప్పినా..కానీ, తనను, తన తండ్రిని నమ్ముకున్న పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉండేందుకు జగన్‌ చేపట్టిన పాదయాత్ర ఈ యాత్ర2.

అలాగే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీ స్థాపించడానికి గల ముఖ్యమైన కారణాలు..అందుకు దారితీసిన వ్యక్తుల మనోభావాలు చూపించారు.చివరికి జగన్ ఒక్కడై..ప్రత్యర్థులంతా ఏకమైనా..ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా..నలుసైనా భయాన్ని చూపకుండా ప్రజల కోసం నిలబడి..ప్రజా రంగంలోప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లోని కథాంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ చూపించాడు. 

డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర 2 రెగ్యులర్ బయోపిక్‌లా కాకుండా..సినిమాటిక్ స్టైల్ లో నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇందులో గడిచిన కథను మాత్రమే చెప్పకుండా..ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు ఎమోషనల్‌గా చూపిస్తూ  ఆడియన్స్ కు అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. 

2009 ఎలక్షన్స్లో కడప ఎంపీగా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (జీవా) పోటీ చేస్తున్నట్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(మమ్ముట్టి) ప్రకటించే సీన్స్ తో యాత్ర 2 కథ స్టార్ట్ అవుతుంది. ఇక . రెండోసారి రాజశేఖర్‌రెడ్డి సీఎం అవ్వడం..ప్రజలకి ఇచ్చిన మాట కోసం కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించడం.. పార్టీ కార్యక్రమంలో భాగంగా చ్చబండ కోసం వెళ్తూ మరణించండంతో యాత్ర 2 సినిమా మలుపు తిరుగుతుంది. ఇక అక్కడ నుంచి జగనుడి కష్టాలు..అధిష్టానాన్ని ఎదురించే సీన్స్ ఆడియన్స్ కి గూస్‌ బంప్స్‌ తెప్పిస్తాయి. ఇక ఆ తర్వాత ప్రజల బాధలు తెలుసుకోవడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర సీన్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఈ యాత్ర లో వచ్చే ప్రతి సీన్ కంటతడి పెట్టిస్తోంది.

2011లో జరిగిన బై ఎలక్షన్స్లో వైఎస్‌ జగన్‌ భారీ మెజార్టీతో గెలిచిన టైంలో..ఆయన్ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీ చేసిన కుట్రలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్‌ లో మొదలై కథనం పూర్తిగా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు..ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో స్టోరీ ముందుకు వెళుతుంది. ఇక జగన్ 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్‌ పాత్రలో నటించిన జీవా చెప్పే డైలాగ్స్ ఆసక్తిగా ఉంటాయి.

వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీని వీడినా..జగన్‌ పట్టువీడని విక్రమార్కుడిలా ధైర్యంతో పార్టీని నడిపించడం..ప్రజా సంకల్ప యాత్ర టైంలో కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. కడపోడు సార్ కడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్త ఏమీకాదుస్వతహాగా దేనిని అయినా ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఎక్కువ‌...పిల్లిని తీసుకెళ్లి అడ‌విలో వ‌దిలిన అది పిల్లే సార్‌...పులిని తీసుకొచ్చి బోనులో పెట్టిన అది పులే అంటూ వ‌చ్చే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ థియేట‌ర్ల‌లో విజిల్స్  వేయిస్తాయి.

ఎవరెలా చేశారంటే.. 

యాత్ర 2 సినిమాలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జీవితాన్ని డైరెక్ట‌ర్‌ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా..ఎమోష‌న‌ల్‌గా చూపించాడు.జ‌గ‌న్ పాత్ర‌లో నటించిన జీవా పూర్తిగా న్యాయం చేశాడ‌ని, త‌న డైలాగ్స్ మేన‌రిజ‌మ్స్‌, బాడీలాంగ్వేజ్‌తో చాలా చోట్ల జ‌గ‌న్‌ను జీవా గుర్తుచేశాడు. జ‌గ‌న్ జీవితంలోని పాదయాత్ర సమయంలో కీల‌క ఘ‌ట్టాల‌ను చాటిచెబుతూ వ‌చ్చే డైలాగ్స్ థియేటర్లో అదిరిపోయాయి.  

వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీగా కేతకి నారాయణ్‌ కనిపించిన తీరు బాగుంది. స్క్రీన్ పై అచ్చం వైఎస్‌ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ క్యారెక్టర్ లో నటించిన సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. చంద్రబాబుగా నటించిన  మహేష్ మంజ్రేకర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కాంగ్రెస్‌ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌ యాక్టింగ్ బాగుంది మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించి..యాత్ర 2కు బలం చేకూర్చారు. 

టెక్నీషియన్స్ :

టెక్నీకల్ పరంగా యాత్ర 2 చాలా రిచ్గా ఉంది. స్క్రీన్పై ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడు డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సాంగ్స్ ఎమోషనల్గా ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చిన ఎమోషనల్ బీజీమ్ ఆకట్టుకుంటోంది. 
జానపద సింగర్ పెంచలదాస్‌ పాడిన వైఎస్సార్‌ పాట ప్రతి ఒక్కరికీ కన్నీళ్లను తెప్పిస్తుంది. మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అద్భుతమైన్ పనితీరు కనబరిచారు.