రాష్ట్రవ్యాప్తంగా 60 రోజులు యాత్రలు నిర్వహిస్తం: రేవంత్

రాష్ట్రవ్యాప్తంగా 60 రోజులు యాత్రలు నిర్వహిస్తం: రేవంత్

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఫిబ్రవరి 6 నుంచి 60 రోజుల పాటు చేపట్టనున్నట్లు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కొన్ని మార్పుల దృష్ట్యా 26వ తేదీ నుంచి కొద్ది రోజులు వాయిదా వేసుకు న్నట్లు తెలిపారు. గాంధీభవన్​లో శనివారం ‘హాత్​ సే హాత్​ జోడో అభియాన్’ పై పీసీసీ విస్త్రత స్థాయి సమావేశం తర్వాత ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. రాహుల్​ చేస్తున్న యాత్ర మహోన్నతమైనదనీ, ఆ యాత్రకు అనుసంధానంగా చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.  ఫిబ్రవరి 6న యాత్ర మొదలవుతుందనీ, దీనికి సోనియా గానీ, ప్రియాంక గాంధీని గానీ ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

ఎక్కడి నుంచి ప్రారంభించాలో నిర్ణయించలె

తన యాత్రను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలన్నది ఇంకా నిర్ణయం కాలేదని రేవంత్​ అన్నారు. కొం దరు భద్రాచలం, మరికొందరు ఆదిలాబాద్ అని రకరకాల ప్రాంతాల నుంచి అడుగుతున్నారన్నారు. అయితే ఎవరు ఎక్కడి నుంచి చేసినా యాత్రను పూర్తి స్థాయిలో సక్సెస్​ చేయాలని టార్గెట్ పెట్టుకు న్నామన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్​లో దళిత దండోరా సభ జరుపుతామన్నారు.  రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావ్ థాక్రే, యాత్ర ఇన్​చార్జ్ గిరీశ్ హాజరైన మీటింగ్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్​ అలీ, సంపత్​కుమార్ సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోమటిరెడ్డిని సస్పెండ్​ చేయాలి: సురేఖ

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ డిమాండ్ ​చేశారు. ఠాక్రే వద్ద మీటింగ్​లో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. వ్యక్తులపై కామెంట్లు వద్దనీ, థాక్రే వద్ద వ్యక్తిగతంగా ప్రస్తావించాలని సూచించారు. తర్వాత ఈ విషయంపై మీడియా సురేఖను ప్రశ్నించగా.. వెంకట్​రెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని.. హైకమాండ్​ఇచ్చిన షోకాజ్​కు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు. మిగతా వాళ్లు కూడా ఇదే రకమైన తప్పు చేసే అవకాశం ఉంటుందని తానీ డిమాండ్ చేశానన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు.

నేటితో పర్యటన ముగింపు

థాక్రే ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీనియర్​ నేతలతో భేటీ అవుతారు. తర్వాత ఆయన నాగర్ కర్నూల్ బయలుదేరి దళిత దండోరా మీటింగ్​లో పాల్గొంటారు. తిరిగి హైదరాబాద్ వచ్చి రాత్రి  8.30కి శంషాబాద్​ ఎయిర్​ పోర్టు నుంచి పూణేకు తిరిగి వెళ్తారు.

యాత్రను సక్సెస్​ చేయాలి

యాత్రను అన్ని జిల్లాల్లో సక్సెస్​ చేసేందుకు ప్రతీ లీడర్ పనిచేయాలని థాక్రే సూచించారని రేవంత్​ తెలిపారు. యాత్ర ప్రారంభమయ్యేలోపు జిల్లాల కొత్త అధ్యక్షులు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. ఎవరు ఎక్కడి నుంచి యాత్ర చేపట్టాలనే షెడ్యూల్​ ఖరారు కాలేదనీ, త్వరలో దాన్ని ఫైనల్​ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనీ, ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వాళ్లను తప్పించి కొత్త వాళ్లకు అప్పగిస్తామన్నారు. బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉందనీ, పార్టీకి నష్టం కలిగించే రీతిలో మాట్లాడకూడదని థాక్రే సూచించారన్నారు. కశ్మీర్​లో జనవరి 26న ముగియాల్సిన రాహుల్​ యాత్ర కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతోందనీ, తామంతా ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నామని రేవంత్​ చెప్పారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వచ్చిన ఇక్కడ యాత్ర చేపట్టడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరం అవుతుందన్నారు. అందుకే తాము ఫిబ్రవరి 6ను యాత్రా తేదీగా ఖరారు చేసుకున్నామన్నారు.